యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ 2026 ఫలితాలు విడుదల
- మెయిన్స్ పరీక్షకు 13,343 మంది అభ్యర్థుల అర్హత
- మొత్తం 1,016 పోస్టుల భర్తీకి కొనసాగుతున్న ప్రక్రియ
- జూన్ 19 నుంచి 28 వరకు మెయిన్స్‌కు దరఖాస్తుల స్వీకరణ
- అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inలో అందుబాటులో అర్హుల జాబితా
ఈ ఏడాది మే 24న దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించారు. మొత్తం 1,016 సివిల్ సర్వీసెస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా, మెయిన్స్‌కు ఎంపికైన వారి జాబితాను నేడు ప్రకటించారు. గతేడాది 1,087 ఖాళీలకు 14,161 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.
మెయిన్స్‌కు అర్హత పొందిన అభ్యర్థులు తప్పనిసరిగా జూన్ 19 నుంచి జూన్ 28, 2026 మధ్య యూపీఎస్సీ పోర్టల్‌లో లాగిన్ అయి డిటైల్డ్ అప్లికేషన్ ఫామ్ (DAF-I) నింపాల్సి ఉంటుంది. ఈ సమయంలోనే రూ.200 పరీక్ష ఫీజును చెల్లించాలి. అయితే, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు.
అభ్యర్థులు సాధించిన మార్కులు, కటాఫ్ మార్కులు, ఆన్సర్ కీలను సివిల్ సర్వీసెస్ 2026 తుది ఫలితాలు వెలువడిన తర్వాతే ప్రకటిస్తామని యూపీఎస్సీ స్పష్టం చేసింది. ఏవైనా సందేహాలుంటే యూపీఎస్సీ కాల్ సెంటర్‌ను సంప్రదించవచ్చని సూచించింది.