రేవంత్ రెడ్డికి హరీశ్ రావు బహిరంగ లేఖ

Harish rao open letter to CM Revanth Reddy
  • కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ చెప్పిందొకటి, అధికారంలోకి వచ్చాక చేస్తోంది ఒకటని విమర్శ
  • వరిధాన్యం కుప్పలు తెప్పలుగా వస్తున్నా కొనుగోళ్లు ప్రారంభించలేదని విమర్శ
  • సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ చెప్పిందొకటి, అధికారంలోకి వచ్చాక చేస్తోంది మరొకటని విమర్శించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ చెప్పిన రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్ అని ఆరోపించారు. పంటల కొనుగోళ్లకు సంబంధించి ఆయన ఈ లేఖను రాశారు. గతంలో తాలు పేరిట తరుగు తీస్తే తోలుతీస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి, ఇప్పుడు కేంద్రాల్లోకి వెళ్లి చూడాలని సూచించారు.

కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యం కుప్పలు తెప్పలుగా వస్తున్నా, ఇంకా కొనుగోళ్లు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. మిల్లుల దగ్గర కూడా బస్తాకు కిలో, రెండు కిలోల తరుగు తీస్తూ రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఎండల్లో రైతులు మాడిపోతున్నా ప్రభుత్వానికి సోయిలేదని విమర్శించారు. ఇచ్చిన మాట ప్రకారం, సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.

పొద్దుతిరుగుడు రైతుల కష్టాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పట్టదా? అని నిలదీశారు. 20 రోజులుగా కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారని అన్నారు. కేంద్రం కొనుగోలు చేసిన పొద్దుతిరుగుడు పంట పావు వంతు మాత్రమేనని అన్నారు. మిగిలిన 1.20 లక్షల క్వింటాళ్లను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. శనగ రైతుల పాలిట కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు శనిలా మారాయని అన్నారు. అనవసర కారణాలతో కేంద్రాల్లో కొనుగోళ్లు నిలిపివేశారని అన్నారు.

శనగలకు మద్దతు ధర రూ.5,875 ఉంటే, ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో ప్రైవేటు వ్యాపారులకు మూడు నాలుగు వేల రూపాయలకే రైతులు అమ్ముకునే దుస్థితి వచ్చిందని అన్నారు. జొన్నల కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. కనీస మద్దతు ధర రూ.3,370 ఉంటే ప్రైవేటు వ్యక్తులకు రూ.2,500కు రైతులు అమ్మవలసిన పరిస్థితి వస్తోందని అన్నారు. మొక్కజొన్న కొనుగోలు నిబంధనను సడలించాలని కోరారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని హరీశ్ రావు పేర్కొన్నారు.
Go Back to Shorts
Harish Rao letter to Revanth Reddy
BRS leader Harish rao
paddy procurement telangana

More Telugu News