మీనాక్షి నటరాజన్‌కు వెన్నుపోటు పొడించింది రేవంత్ రెడ్డే: కేటీఆర్
- మీనాక్షి నటరాజన్‌పై రేవంత్ కుట్ర అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు
- ఆమెకు రాజ్యసభ సీటు రాకుండా బీజేపీతో రేవంత్ కుమ్మక్కయ్యారని ఆరోపణ
- కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శలు
- ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక రావడం ఖాయమని జోస్యం
- ఓటర్ల జాబితాపై అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపు
ఆదివారం ఖైరతాబాద్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. రేవంత్ రెడ్డి అవినీతి, భూ ఒప్పందాలపై మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారని, దీనికి ప్రతీకారంగానే హైదరాబాద్‌లో ఆమెపై తప్పుడు కేసు పెట్టించారని అన్నారు. సొంత పార్టీ నేతలనే వెన్నుపోటు పొడిచే నైజం రేవంత్ రెడ్డిదని ఆయన దుయ్యబట్టారు. హిట్లర్ తన ఆదర్శం అని సీఎం చెప్పడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పాలనను 'అట్టర్ ఫ్లాప్ సినిమా'గా అభివర్ణించిన కేటీఆర్, ప్రభుత్వం హామీల అమలులో పూర్తిగా విఫలమైందని అన్నారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని, కనీసం 4,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని ప్రశ్నించారు. రూ.4,000 నిరుద్యోగ భృతి హామీని కూడా విస్మరించారని మండిపడ్డారు. కోటి మంది మహిళలను లక్షాధికారులను చేశామని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.
ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక రావడం ఖాయమని కేటీఆర్ జోస్యం చెప్పారు. ప్రజాతీర్పును ధిక్కరించి దానం నాగేందర్ కాంగ్రెస్‌లోకి ఫిరాయించడమే దీనికి కారణమని స్పష్టం చేశారు. జూన్ 25 నుంచి జరిగే ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని, డిజిటల్ సభ్యత్వ నమోదును రికార్డు స్థాయిలో చేపట్టాలని పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు.