దయచేసి వ్యక్తిగతంగా చొరవ తీసుకోండి: రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ

Kishan reddy open letter to revanth Reddy over Railway development works
  • చర్లపల్లి రైల్వే టెర్మినల్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల మౌలిక సదుపాయాలపై లేఖ
  • గతంలోను ముఖ్యమంత్రికి లేఖ రాశానన్న కిషన్ రెడ్డి
  • అయినప్పటికీ ఎలాంటి పురోగతి కనిపించడం లేదన్న కేంద్రమంత్రి
చర్లపల్లి నూతన రైల్వే టెర్మినల్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మౌలిక సదుపాయాలకు సంబంధించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఈ పనుల నిమిత్తం గతంలో పలుమార్లు లేఖలు రాసినా అధికారుల నుంచి క్షేత్రస్థాయిలో ఎలాంటి పురోగతి లేదని పేర్కొన్నారు. "దయచేసి ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా చొరవ తీసుకుని ఆయా రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులను పూర్తి చేయాలి" అని విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్ నగరంలో రోజురోజుకు పెరుగుతున్న జనాభా, ప్రయాణికుల రాకపోకల మూలంగా నగరంలోని మూడు ప్రధాన రైల్వే స్టేషన్లు సికింద్రాబాద్, కాచిగూడ, హైదరాబాద్ టెర్మినళ్లపై అధిక భారం పడుతోందని గుర్తు చేశారు. ఈ సమస్యకు పరిష్కారంగానే చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద రూ.430 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో కొత్త టెర్మినల్‌ను కేంద్రం అభివృద్ధి చేసిందని అన్నారు.

గత సంవత్సరం ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ టెర్మినల్ నుంచి పదుల సంఖ్యలో రైళ్లు సేవలు అందిస్తున్నాయని తెలిపారు. రోజురోజుకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నందున రైల్వే స్టేషన్‌కు వెలుపల అప్రోచ్ రోడ్లను విస్తరించాల్సి ఉందని అన్నారు. స్టేషన్‌కు ఇరువైపులా పార్కింగ్ తదితర అవసరాల కోసం కూడా భూసేకరణ చేయాల్సి ఉందని తెలిపారు.

చర్లపల్లి స్టేషన్ నుంచి ఎఫ్‌సీఐ గోడౌన్‌కు 200 అడుగుల వెడల్పుతో, భరత్ నగర్, ఈసీ నగర్‌ల వైపు 100 అడుగుల చొప్పున వెడల్పుతో రోడ్లను విస్తరించాలని కోరారు. చర్లపల్లి టెర్మినల్‌కు నీటి సరఫరా కనెక్షన్‌ను ఏర్పాటు చేయడానికి రైల్వే శాఖ రూ.4 కోట్లు జమ చేసిందని, ఈ నీటి కనెక్షన్ త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

భవిష్యత్తు రద్దీని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక సౌకర్యాలతో పునరాభివృద్ధి చేస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ స్టేషన్ వద్ద ఆల్ఫా హోటల్ నుంచి రేతిఫైల్ బస్ స్టేషన్ వరకు ఉన్న రహదారిని 120 అడుగుల వెడల్పుతో విస్తరించాల్సి ఉందని అన్నారు. ఈ అభివృద్ధి పనుల కోసం రైల్వే శాఖ అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులతో క్షేత్రస్థాయి పరిశీలన జరిపి నివేదించామని అన్నారు.

ఈ పెండింగ్ పనులకు సంబంధించి 2022, 2023 సంవత్సరాలలో నాటి ముఖ్యమంత్రికి రెండుసార్లు లేఖలు రాశానని గుర్తు చేశారు. 2024లో మీకు కూడా లేఖ రాశానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అయినా ఇప్పటి వరకు పనులు పూర్తి కాలేదని అన్నారు. తాను ఉత్తరం రాసిన తర్వాత మీరు పనులు ప్రారంభించాలని ఆదేశించినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి ఫలితం లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఈ పనులను పూర్తి చేయాలని తన లేఖలో కిషన్ రెడ్డి కోరారు.
Go Back to Shorts
Kishan Reddy letter to Revanth Reddy
Telangana Development projects

More Telugu News