నో స్టాక్ బోర్డుల వేళ.. పెద్ద మనసు చాటుకున్న తిరుపతి బంక్ యజమాని.. ఫ్రీగా పెట్రోల్ పంపిణీ!

Tirupati Petrol Bunk Owner Rommala Rajesh Reddy Distributes Free Fuel
  • ఏపీని వెంటాడుతున్న పెట్రోల్, డీజిల్ కొరత
  • రాష్ట్రవ్యాప్తంగా బంకుల వద్ద దర్శనమిస్తున్న నో స్టాక్ బోర్డులు
  • తిరుపతిలో ఉచితంగా పెట్రోల్ పంపిణీ చేస్తున్న బంక్ యజమాని
  • దాదాపు 5 వేల మందికి లీటర్ చొప్పున ఉచితంగా పెట్రోల్
  • ప్రజల ఇబ్బందులు చూసి చలించిపోయి సాయం చేస్తున్నట్లు వెల్లడి
ఏపీలో గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. రాష్ట్రంలోని చాలా పెట్రోల్ బంకుల వద్ద 'నో స్టాక్' బోర్డులు దర్శనమిస్తుండగా, స్టాక్ ఉన్న కొన్ని చోట్ల వాహనదారులు కిలోమీటర్ల కొద్దీ బారులు తీరుతున్నారు. ప్రభుత్వం ఈ సమస్యను చక్కదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తుండగా, తిరుపతికి చెందిన ఓ పెట్రోల్ బంక్ యజమాని తన పెద్ద మనసు చాటుకుని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

తిరుపతి రూరల్ మండలం, తనపల్లి వద్ద ఐఓసీఎల్ పెట్రోల్ బంక్ యజమాని రొమ్మల రాజేష్ రెడ్డి, ప్రజల కష్టాలు చూసి చలించిపోయారు. తన బంకుకు వచ్చిన వాహనదారులకు ఉచితంగా లీటర్ పెట్రోల్ పంపిణీ చేస్తున్నారు. దాదాపు 5 వేల మందికి పెట్రోల్ ఉచితంగా అందించామని.. తన వద్ద స్టాక్ ఉన్నంత వరకు ఈ సేవ కొనసాగిస్తానని ఆయన తెలిపారు. అంతేగాక‌ ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని క్యూలో నిలబడిన వారికి ఉచితంగా వాటర్ బాటిళ్లు కూడా అందిస్తూ మానవత్వం చాటుకుంటున్నారు.

ఈ సందర్భంగా రాజేష్ రెడ్డి మాట్లాడుతూ... "గత మూడు రోజులుగా రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్ కొరతను, ప్రజల ఆందోళనను చూస్తున్నాను. ముఖ్యంగా తిరుమలకు వచ్చే భక్తులు, స్థానికులు పడుతున్న ఇబ్బందులు నన్ను కదిలించాయి. వారికి భరోసా ఇచ్చేందుకే నా వంతుగా ఈ చిన్న సాయం చేస్తున్నాను. ఎండలో వారి బాధను చూడలేకపోయాను" అని వివరించారు.

రాష్ట్రంలో ఇంధన కొరతను నివారించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ, ఆయిల్ కంపెనీలతో చర్చిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సంక్షోభం ఇలాగే కొనసాగితే, తన బంకుకు మళ్లీ స్టాక్ వచ్చిన వెంటనే మరికొన్ని రోజులు ఉచితంగా పెట్రోల్ పంపిణీ చేస్తానని రాజేష్ రెడ్డి ప్రకటించారు. రొమ్మల రాజేష్ రెడ్డి గతంలో తన ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని స్థానికులు చెబుతున్నారు. అసలే పెట్రోల్ దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో ఉచితంగా ఇంధనం అందించడం గొప్ప విషయమని వాహనదారులు ఆయనను ప్రశంసిస్తున్నారు.
Go Back to Shorts
Tirupati
Petrol crisis
Rommala Rajesh Reddy
Fuel shortage
Free petrol
Andhra Pradesh
IOCL petrol bunk
Chandrababu Naidu
Tanapalli
Fuel distribution

More Telugu News