పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థి అర్జున్ సింగ్ తనపై ఏకంగా 119 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. 2019లో ఆయనపై కేవలం 24 కేసులు మాత్రమే ఉండగా, ఈసారి ఆ సంఖ్య భారీగా పెరగడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

నోయాపారా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్న అర్జున్ సింగ్, తన నామినేషన్ పత్రాలతో పాటు 93 పేజీల అఫిడవిట్‌ను ఎన్నికల సంఘానికి సమర్పించారు. ఈ అఫిడవిట్‌లో ఆయన తన ఆస్తులు, అప్పులతో పాటు తనపై ఉన్న కేసుల వివరాలను అధికారికంగా వెల్లడించారు. అర్జున్ సింగ్ గతంలో బారక్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు.

అర్జున్ సింగ్ రాజకీయ ప్రస్థానం కూడా ఆసక్తికరంగా ఉంది. గతంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నుంచి భట్‌పారా నియోజకవర్గం ఎమ్మెల్యేగా నాలుగుసార్లు గెలిచారు. 2019లో బీజేపీలో చేరి ఎంపీగా విజయం సాధించారు. అనంతరం 2022లో తిరిగి టీఎంసీ గూటికి చేరిన ఆయన, 2024 లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ నిరాకరించడంతో మళ్లీ బీజేపీలో చేరారు.