హర్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ డ్రోన్ల దాడి

Iran US Navy clash in Hormuz Strait after drone attacks
  • ఇరాన్ వాణిజ్య నౌకను స్వాధీనం చేసుకున్న అమెరికా
  • ప్రతీకారంగా అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ డ్రోన్ల దాడి
  • భగ్నమైన కాల్పుల విరమణ ఒప్పందం
  • చర్చలకు ఇరాన్ నిరాకరణ
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. తమ వాణిజ్య నౌకను అమెరికా బలగాలు స్వాధీనం చేసుకోవడంతో, ప్రతీకారంగా ఆ దేశ యుద్ధ నౌకలపై డ్రోన్లతో దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. హర్మూజ్ జలసంధి సమీపంలోని ఒమన్ తీరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పరిణామంతో ఇరు దేశాల మధ్య నెలకొన్న కాల్పుల విరమణ ఒప్పందం ముక్కలైంది.

చైనా నుంచి ఇరాన్‌కు వెళ్తున్న 'తూస్కా' అనే వాణిజ్య నౌకను అమెరికాకు చెందిన 'యూఎస్‌ఎస్ స్ప్రూయెన్స్' యుద్ధ నౌక అడ్డుకుంది. అమెరికా విధించిన నౌకాదళ నిర్బంధాన్ని ఉల్లంఘించిందన్న ఆరోపణలతో, హెచ్చరికల అనంతరం నౌకను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధ్రువీకరించారు.

అమెరికా చర్యను 'సాయుధ సముద్రపు దొంగతనం'గా ఇరాన్ సైనిక కమాండ్ అభివర్ణించింది. నౌకను స్వాధీనం చేసుకున్న కొన్ని గంటల్లోనే తమ బలగాలు డ్రోన్లతో ప్రతిదాడికి దిగినట్లు తెలిపింది. తమ ఐఆర్‌జీసీ బలగాల జోక్యంతో అమెరికా సేనలు వెనక్కి తగ్గాయని ఇరాన్ మీడియా చెబుతుండగా, నౌక ఇంకా తమ వద్దే ఉందని అమెరికా స్పష్టం చేస్తోంది.

ప్రపంచ చమురు రవాణాలో ఐదో వంతు హర్మూజ్ జలసంధి నుంచే సాగుతుంది. ఈ తాజా పరిణామాలతో చమురు ధరలు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మంగళవారంతో కాల్పుల విరమణ గడువు ముగియనుండగా, ఇకపై చర్చలు జరిపేది లేదని ఇరాన్ తేల్చిచెప్పింది.  
Advertisement
Hormuz Strait
Iran
US Navy
drone attack
Tuska vessel
Persian Gulf
oil prices
Middle East tensions
USS Spruance
IRGC

More Telugu News