19 ఏళ్లకే విశ్వసుందరి పోటీలకు.. కేరళ లా విద్యార్థిని కాజియా ఘనత

Kazia Liz Mejo 19 Year Old Kerala Law Student Wins Miss Universe India 2026 Title
  • కేరళ అమ్మాయి కాజియాకు మిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటం
  • జైపూర్‌లో జరిగిన ఫైనల్స్‌లో 52 మంది పోటీదారులను అధిగమించి విజయం
  • నవంబర్‌లో ప్యూర్టోరికోలో జరగనున్న 75వ మిస్ యూనివర్స్ పోటీలకు అర్హత
  • ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా గుర్తింపు
  • ఈ కిరీటం గెలుచుకున్న తొలి కేరళ యువతిగా రికార్డు
కేరళకు చెందిన 19 ఏళ్ల లా విద్యార్థిని, మోడల్ కాజియా లిజ్ మెజో ‘మిస్ యూనివర్స్ ఇండియా 2026’ కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఆగస్టు 23, ఆదివారం జైపూర్‌లోని జీ స్టూడియోస్‌లో అట్టహాసంగా జరిగిన ఫైనల్స్‌లో ఆమె విజేతగా నిలిచింది. ఈ విజయంతో, నవంబర్‌లో ప్యూర్టోరికోలో జరగనున్న 75వ మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో ఆమె భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనుంది.

రాష్ట్రస్థాయి పోటీలు, ఆడిషన్లు, గ్రూమింగ్ రౌండ్ల తర్వాత ఫైనల్స్‌కు చేరిన 52 మంది పోటీదారుల నుంచి కాజియా విజేతగా నిలిచింది. గత ఏడాది విజేత మణిక విశ్వకర్మ ఆమెకు కిరీటాన్ని అలంకరించింది. ఈ పోటీల్లో తమిళనాడుకు చెందిన వైష్ణవి గణేష్ ఫస్ట్ రన్నరప్‌గా నిలవగా, ఆమెకు ‘మిస్ ఇంటర్నేషనల్ ఇండియా 2026’ టైటిల్ కూడా దక్కింది. గుజరాత్‌కు చెందిన అనుశ్రీ సతవలేకర్ సెకండ్ రన్నరప్‌గా నిలిచింది.

కేరళలోని అలప్పుళ జిల్లా మావెలిక్కర ప్రాంతానికి చెందిన కాజియా, ప్రస్తుతం లా చదువుతూనే మోడలింగ్‌లో రాణిస్తోంది. ఆమె తన చిన్నతనం ఎక్కువ భాగం అబుదాబిలో గడిపింది. అక్కడి ఎమిరేట్స్ నేషనల్ స్కూల్, సెయింట్ జోసెఫ్స్ స్కూల్, అబుదాబి ఇండియన్ స్కూల్‌లో విద్యాభ్యాసం చేసింది. విభిన్న సంస్కృతుల మధ్య పెరగడం ఆమె ఆత్మవిశ్వాసానికి, వాక్చాతుర్యానికి దోహదపడింది.

కాజియా తన కెరీర్‌లో వేగంగా ఉన్నత స్థాయికి చేరుకుంది. 17 ఏళ్ల వయసులోనే ‘మిస్ టీన్ దివా 2024’ టైటిల్ గెలుచుకుంది. 2025లో ‘మిస్ టీన్ ఇంటర్నేషనల్’ పోటీల్లో భారత్ తరఫున పాల్గొని ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. ఈ ఏడాది ప్రారంభంలో ‘మిస్ యూనివర్స్ కేరళ’ టైటిల్‌ను అతి పిన్న వయసులో గెలుచుకొని రికార్డు సృష్టించింది. పదేళ్లకు పైగా శాస్త్రీయ నృత్యంలో శిక్షణ పొందడంతో పాటు డ్రమ్స్, వయోలిన్ వాయించడంలోనూ ఆమెకు ప్రావీణ్యం ఉంది. మలయాళ చిత్రం ‘షైలాక్’లో కూడా ఆమె చిన్న పాత్రలో కనిపించింది.

గెలుపు అనంతరం కాజియా మాట్లాడుతూ "ప్రపంచ శిఖరాన ఉన్నంత ఆనందంగా ఉంది. ఈ కిరీటాన్ని కేరళకు తీసుకెళ్లి, నా సొంత ఊరిని ప్రపంచానికి చూపించగలుగుతున్నందుకు సంతోషంగా ఉంది" అని పేర్కొంది. మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్, ఊర్వశీ రౌతేలా, రియా సింఘా, సెలీనా జైట్లీ వంటి ప్రముఖులు ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.

ప్రస్తుతం కాజియా, అంతర్జాతీయ పోటీల కోసం స్టైలింగ్, ఫిట్‌నెస్, పబ్లిక్ స్పీకింగ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకోనుంది. ఇటీవలి కాలంలో ఈ టైటిల్ గెలిచిన అతి పిన్న వయస్కురాలిగా, ప్రస్తుత ఫ్రాంచైజీ కింద మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్న తొలి కేరళ యువతిగా ఆమె నిలిచింది.
Advertisement
Kazia Liz Mejo
Miss Universe India 2026
Miss Universe Kerala Winner
Kazia Liz Mejo Miss Universe India
Miss Universe India 2026 Winner
Kerala Law Student Kazia Liz Mejo

More Telugu News