తిరుపతిలో ప్రేమ విఫలమై విద్యార్థి ఆత్మహత్య

Mahendra Student Commits Suicide in Tirupati After Love Failure
  • ప్రేమించిన యువతికి పెళ్లి కావడంతో తీవ్ర మనస్తాపం
  • ఆత్మహత్యకు ముందు కుటుంబానికి చివరి మెసేజ్
  • ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమించిన యువతికి మరొకరితో వివాహం జరగడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటరమణ లేఅవుట్‌లో ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా గంగవరం మండలం వేములపల్లి గ్రామానికి చెందిన జె. మహేంద్ర (20) తిరుపతిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీకాం కంప్యూటర్స్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. నగరంలోని వెంకటరమణ లేఅవుట్‌లో స్నేహితులతో కలిసి అద్దె గదిలో నివసిస్తున్నాడు. గత కొంతకాలంగా తాను ప్రేమించిన యువతికి వారం క్రితం వేరే వ్యక్తితో వివాహం జరగడంతో మహేంద్ర తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు.

ఈ క్రమంలో తన బాబాయ్‌కి, సోదరికి మొబైల్‌లో మెసేజ్‌లు పంపాడు. 'నన్ను క్షమించండి.. అమ్మంటే నాకు చాలా ఇష్టం. ఆమెను బాగా చూసుకోండి' అని ఆ సందేశంలో పేర్కొన్నాడు. ఆ తర్వాత తన గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు. ఉదయం స్నేహితులు గమనించి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న తిరుపతి వెస్ట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రుయా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
 
Go Back to Shorts
Student suicide
Mahendra
Tirupati
Love failure
Chittoor district
Gangavaram
Private college
B.Com computers
Venkataramana Layout
Ruia Hospital

More Telugu News