అది ఆటవిక చర్య.. భార్గవ్ రెడ్డిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

Sajjala Bhargav Reddy Case High Court Outraged by Defamatory Posts
  • వైసీపీ మాజీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌పై హైకోర్టు ఆగ్రహం
  • అది ఆటవిక, అనాగరిక ప్రవర్తన అంటూ తీవ్ర వ్యాఖ్యలు
  • సీఎం, డిప్యూటీ సీఎం కుటుంబసభ్యులపై పోస్టులు పెడతారా అని ప్రశ్న
  • షరతులతో కూడిన ఉపశమనం... ఎల్‌ఓసీ రద్దుకు ఆదేశం
  • నిందితులపై దర్యాప్తు చేసి శిక్షపడేలా చూడాలని పోలీసులకు ఆదేశం
వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్‌చార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి వ్యవహారంలో ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా మంత్రుల కుటుంబ సభ్యుల ప్రతిష్ఠను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని 'ఆనాగరిక, ఆటవిక ప్రవర్తన'గా అభివర్ణించింది. ఇతరుల గౌరవ ప్రతిష్ఠలను కించపరిచే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసింది.

తనపై జారీ చేసిన లుక్అవుట్ సర్క్యులర్ (ఎల్‌ఓసీ)ను రద్దు చేయాలని కోరుతూ భార్గవ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయస్థానం పిటిషనర్ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వాక్ స్వాతంత్ర్యం, భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయని ధర్మాసనం గుర్తు చేసింది.

ఈ కేసులో పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి, నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. అదే సమయంలో దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని భార్గవ్ రెడ్డిని ఆదేశించింది. అవసరమైనప్పుడు విచారణకు హాజరవుతానని అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది.

ఈ షరతులకు లోబడి భార్గవ్ రెడ్డిపై ఉన్న ఎల్‌ఓసీని రీకాల్ చేయాలని అన్నమయ్య జిల్లా ఎస్పీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమకు అభ్యర్థన అందిన వెంటనే ఎల్‌ఓసీని రద్దు చేయాలని ఇమిగ్రేషన్ అధికారులను కూడా ఆదేశిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.
Go Back to Shorts
AP High Court
Sajjala Bhargav Reddy
Chandrababu Naidu
Pawan Kalyan
YCP Social Media
Look Out Circular
Defamatory Posts
Andhra Pradesh Politics
Social Media Abuse
Freedom of Speech

More Telugu News