గత రాత్రి ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పట్టిన ఓ అద్భుతమైన క్యాచ్‌పై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆ క్యాచ్‌ను, తాను ప్రత్యక్షంగా చూసిన అత్యుత్తమ క్యాచ్‌లలో ఒకటిగా అభివర్ణించాడు. కేవలం అథ్లెటిజం మాత్రమే కాదని, దాని వెనుక అద్భుతమైన అవగాహన, సమయస్ఫూర్తి ఉన్నాయని సచిన్ ప్రత్యేకంగా విశ్లేషించాడు.

శ్రేయస్ అయ్యర్ క్యాచ్ గురించి సచిన్ సోషల్ మీడియాలో స్పందిస్తూ... "బంతి వేగాన్ని, ఎత్తును అంచనా వేయడం, బౌండరీ లైన్ ఎక్కడుందో గమనించుకోవడం, దాన్ని తొక్కకుండా సరైన సమయంలో గాల్లోకి లేవడం.. ఇవన్నీ అద్భుతం. అంతటితో ఆగకుండా, గాల్లో ఉండగానే బంతిని పట్టుకుని, కిందపడేలోపు తన సహచర ఫీల్డర్‌కు అందించాడు. ఆ సమయంలో తన టీమ్‌మేట్ ఎక్కడున్నాడో కూడా కచ్చితంగా తెలిసి ఉండాలి. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది" అని వివరించారు.

ఇలాంటి ఫీట్ చేయాలంటే నమ్మశక్యంకాని అవగాహన, టైమింగ్, ఫిట్‌నెస్, సంయమనం అవసరమని సచిన్ తెలిపారు. "శ్రేయస్ అయ్యర్ అన్నింటినీ కచ్చితంగా అంచనా వేశాడు. నేను ప్రత్యక్షంగా చూసిన అత్యుత్తమ క్యాచ్‌లలో ఇది కచ్చితంగా ఒకటి" అని సచిన్ కొనియాడారు.