దడదడలాడించిన పంజాబ్ కింగ్స్... ముంబై ఖాతాలో మరో ఓటమి

Shreyas Iyer and Prabhsimran Singh Power Punjab Kings IPL Win
  • ముంబై ఇండియన్స్‌పై 7 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ఘన విజయం
  • క్వింటన్ డికాక్ అద్భుత సెంచరీ (112*) వృథా
  • లక్ష్య ఛేదనలో చెలరేగిన ప్రభ్‌సిమ్రన్ సింగ్ (80*), శ్రేయస్ అయ్యర్ (66)
  • అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న అర్ష్‌దీప్ సింగ్ (3/22)
  • ఈ విజయంతో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌ను పదిలం చేసుకున్న పంజాబ్
ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను 7 వికెట్ల తేడాతో పంజాబ్ చిత్తుగా ఓడించింది. ముంబై నిర్దేశించిన 196 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 16.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (39 బంతుల్లో 80*), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (35 బంతుల్లో 66) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో పంజాబ్‌కు మరపురాని విజయాన్ని అందించారు. ఈ గెలుపుతో పంజాబ్ పాయింట్ల పట్టికలో తమ అగ్రస్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంది.

196 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ కింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. అయితే, 45 పరుగులకే ప్రియాన్ష్ ఆర్య (15), కూపర్ కానలీ (17) వికెట్లను కోల్పోయింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్‌తో కలిసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు కేవలం 66 బంతుల్లోనే 139 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ముంబై బౌలర్లను లక్ష్యంగా చేసుకుని బౌండరీల వర్షం కురిపించారు. ప్రభ్‌సిమ్రన్ ఆఖరి వరకు నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించాడు. ముంబై బౌలర్లు పూర్తిగా తేలిపోయి భారీగా పరుగులు సమర్పించుకున్నారు. 

అంతకుముందు, ఈ పోరులో పంజాబ్ కింగ్స్‌ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇన్నింగ్స్ ఆరంభంలోనే తడబడింది. 12 పరుగులకే రియాన్ రికెల్టన్ (2), సూర్యకుమార్ యాదవ్ (0) వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఓపెనర్ క్వింటన్ డికాక్ అద్వితీయ పోరాటం చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా, మరో ఎండ్‌లో పాతుకుపోయి పంజాబ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అతనికి నమన్ ధిర్ (31 బంతుల్లో 50) చక్కటి సహకారం అందించడంతో ముంబై కోలుకుంది. డికాక్ కేవలం 60 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో అజేయంగా 112 పరుగులు సాధించాడు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు చేసింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ కేవలం 22 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టి ముంబైని కట్టడి చేశాడు.

పంజాబ్ కింగ్స్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌లలో 4 విజయాలు నమోదు చేసింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ప్రస్తుతం పంజాబ్ 9 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది.


Go Back to Shorts
Shreyas Iyer
Punjab Kings
Mumbai Indians
IPL 2026
Prabhsimran Singh
Quinton de Kock
Arshdeep Singh
Wankhede Stadium
Cricket
T20

More Telugu News