ఏపీ పోలీసులకు తీపికబురు.. ఇకపై పుట్టినరోజు, పెళ్లిరోజున ప్రత్యేక సెలవు
- అన్ని ర్యాంకుల సిబ్బందికి ఈ సెలవులు వర్తింపజేయాలని డీజీపీ ఆదేశం
- పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పెన్షన్ ప్రతిపాదనల ప్రక్రియలో మార్పులు
- మే 1 నుంచి పెన్షన్ దరఖాస్తులు ఆన్లైన్లోనే సమర్పించాలని ఉత్తర్వులు
ఈ మేరకు రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్ని జిల్లాల ఎస్పీలకు, పోలీస్ విభాగాల అధిపతులకు ఆదేశాలు పంపారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే తప్ప, సిబ్బంది కోరిన వెంటనే ఈ ప్రత్యేక సెలవును మంజూరు చేయాలని ఆయన స్పష్టంగా సూచించారు. ఈ విషయంలో ఎలాంటి జాప్యం జరగకూడదని, సెలవు మంజూరు చేయడం తప్పనిసరి అని ఆదేశాల్లో పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు తమ కుటుంబ సభ్యులతో గడిపే సమయం చాలా తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వారి జీవితంలో ముఖ్యమైన ఈ రెండు రోజుల్లోనైనా కుటుంబంతో సంతోషంగా గడిపేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రత్యేక సెలవుల ద్వారా సిబ్బంది మానసికంగా ఉల్లాసం పొంది, విధుల్లో మరింత ఉత్సాహంగా పాల్గొంటారని ఉన్నతాధికారులు ఆశిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పెన్షనర్లకు కొత్త నిబంధన
మరోవైపు పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ ప్రతిపాదనలకు సంబంధించి ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు కొనసాగుతున్న ఫిజికల్ (మాన్యువల్) పద్ధతిలో పెన్షన్ ప్రతిపాదనలను సమర్పించేందుకు ఈ నెల 30వ తేదీ వరకు మాత్రమే అవకాశం కల్పించారు. మే 1వ తేదీ నుంచి రిటైర్డ్ ఉద్యోగులు తప్పనిసరిగా 'నిధి' పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే తమ దరఖాస్తులను సమర్పించాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూశ్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.