ఆశా భోంస్లేకు భావోద్వేగ నివాళి అర్పించిన ఆసీస్ క్రికెట్ లెజెండ్

Asha Bhosle Aussie Cricket Legend Brett Lee Pays Emotional Tribute
భారత సంగీత దిగ్గజం, ప్రముఖ గాయని ఆశా భోంస్లే (92) మృతి పట్ల ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. ఆమెతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగ నివాళి అర్పించాడు. 2007లో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'యూ ఆర్ ది వన్ ఫర్ మీ' పాట అప్పట్లో ఎంతగానో ప్రాచుర్యం పొందింది.

ఈ మేరకు బ్రెట్ లీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. "2006లో ఆశా భోంస్లే గారితో కలిసి 'యూ ఆర్ ది వన్ ఫర్ మీ' పాటను రాయడం, రికార్డ్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆమె అసాధారణ ప్రతిభ మాత్రమే కాదు, ఆమెలోని దయ, వినయం నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. జీవితంలో ఎంతో సాధించినా, ఆమె ఎంతో ఆత్మీయంగా ఉండేవారు" అని లీ పేర్కొన్నాడు. "ఈ సమయంలో ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఆమె వారసత్వం తరతరాలు నిలిచిపోతుంది" అని ఆశాజీతో దిగిన ఫోటోను పంచుకున్నాడు.

తన ఆత్మకథ 'మై లైఫ్: బ్రెట్ లీ'లో కూడా ఈ పాట గురించి లీ ప్రస్తావించాడు. 2006లో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్‌కు వచ్చినప్పుడు ఈ పాట వీడియోను చిత్రీకరించినట్లు తెలిపాడు. ఈ పాటలో "హా, మై తుమ్హారా హూ, తుమ్హారా హీ రహుంగా" (అవును, నేను నీ వాడిని, నీ వాడిగానే ఉంటాను) అనే హిందీ లైన్లను కూడా బ్రెట్ లీనే పాడటం విశేషం. ఆశాజీ భారత సంగీతానికి అరెథా ఫ్రాంక్లిన్ లాంటి వారని, అలాంటి లెజెండ్‌తో పనిచేసే అవకాశం రావడం గొప్ప విషయమని తన పుస్తకంలో రాసుకున్నాడు.

అనారోగ్యంతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరిన ఆశా భోంస్లే ఆదివారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆమె మరణంతో భారత సంగీతంలో ఒక శకం ముగిసినట్లయింది.
Go Back to Shorts
Asha Bhosle
Brett Lee
You are the one for me
Indian Singer
Australian Cricketer
Bollywood Music
Cricket
Music Collaboration
Death
Tribute

More Telugu News