చెపాక్‌లో సంజూ మెరుపులు.. పసుపు జెర్సీలో తొలి అర్ధశతకం!
- ఫామ్ అందుకున్న సంజు శాంసన్
- చెన్నై సూపర్ కింగ్స్ తరఫున తొలి హాఫ్ సెంచరీ నమోదు
- ఢిల్లీపై 26 బంతుల్లోనే మెరుపు అర్ధశతకం
- మూడు మ్యాచుల్లో విఫలమైన తర్వాత చెలరేగిన వైనం
ఈ సీజన్‌లో ఆడిన తొలి మూడు మ్యాచ్ లలో విఫలమై నిరాశపరిచిన సంజూ, ఈ మ్యాచ్‌లో మాత్రం ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగి బౌండరీలతో విరుచుకుపడ్డాడు. కేవలం 26 బంతుల్లోనే 9 ఫోర్ల సాయంతో 50 పరుగుల మార్కును అందుకున్నాడు. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో సింగిల్ తీసి సీఎస్కే తరఫున తన తొలి హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
పసుపు జెర్సీలో ఇదే తొలి అర్ధశతకం కావడంతో సంజూ ఎంతో ఆనందంగా కనిపించాడు. తన కలల జట్టు అయిన చెన్నై తరఫున రాణించాలన్న పట్టుదలతో బరిలోకి దిగిన అతను, ఎట్టకేలకు తన బ్యాట్ పవర్ చూపించాడు. ప్రస్తుతం సంజూ 43 బంతుల్లో 90 పరుగులతో సెంచరీ దిశగా కొనసాగుతున్నాడు. చెన్నై జట్టు 15 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి 160 పరుగులు చేసింది.