చంద్రబాబు విజన్, లోకేశ్ కృషి ఫలితం... ‘సిటీ ఆఫ్ డెస్టినీ’ నుంచి గ్లోబల్ ఏఐ సిటీగా విశాఖ

Chandrababu Vision and Nara Lokesh Efforts Transforms Visakhapatnam into Global AI City
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానంలో మరో చారిత్రాత్మక అధ్యాయం మొదలుకాబోతోంది. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్, విశాఖపట్నంలో భారీ డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హబ్ ఏర్పాటుకు సిద్ధమైంది. సుమారు 15 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1.35 లక్షల కోట్లు) పెట్టుబడితో రానున్న ఈ మెగా ప్రాజెక్టుకు ఈ నెల 28న ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ ప్రాజెక్టుతో ఇప్పటివరకు 'సిటీ ఆఫ్ డెస్టినీ'గా ఉన్న విశాఖ, ఇకపై 'గ్లోబల్ ఏఐ సిటీ'గా ప్రపంచ పటంలో నిలవనుందని ఆయన అన్నారు.

గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాపులుప్పాడ సమీపంలో 601 ఎకరాల విస్తీర్ణంలో ఈ గూగుల్ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుందని తెలిపారు. 2028 జూలై నాటికి ఇది పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభిస్తుందని, దేశంలోనే తొలి 1 గిగావాట్ సామర్థ్యం గల ఏఐ హబ్‌గా విశాఖ అవతరించనుందని వివరించారు. 

ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రావడమే కాకుండా, ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పల్లా ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికత, సాంకేతికతపై ఆయనకున్న పట్టు వల్లే గూగుల్ వంటి ప్రపంచస్థాయి సంస్థలు ఏపీ వైపు చూస్తున్నాయని కొనియాడారు.

ఈ భారీ పెట్టుబడి రాష్ట్రానికి రావడంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కృషి, పట్టుదల కీలక పాత్ర పోషించాయని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఆయన నిరంతర ప్రయత్నాల వల్లే ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చిందని అన్నారు. 

ఈ డేటా సెంటర్‌తో ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తం ఒక టెక్నాలజీ హబ్‌గా మారుతుందని, రహదారులు, విద్యుత్, నీటి సరఫరా వంటి మౌలిక వసతులు శరవేగంగా అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. స్థానిక యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ లభించి, ప్రపంచస్థాయి టెక్నాలజీపై పనిచేసే అనుభవం దక్కుతుందని, తద్వారా అంతర్జాతీయంగా అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వ పారదర్శక విధానాలు, పెట్టుబడులకు కల్పిస్తున్న అనుకూల వాతావరణం వల్లే గ్లోబల్ ఇన్వెస్టర్లు ముందుకు వస్తున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి ఎన్నో ప్రతికూల శక్తులు ప్రయత్నించాయని, అయినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో వాటన్నింటినీ అధిగమించి అభివృద్ధి దిశగా సాగుతున్నామని పల్లా అన్నారు. 

ఇది కేవలం ఒక డేటా సెంటర్ కాదని, ఉత్తరాంధ్ర యువత భవిష్యత్తుకు, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి మార్గం చూపే ఒక మహత్తర అవకాశమని ఆయన అభివర్ణించారు. "విజన్ ఆంధ్రప్రదేశ్" లక్ష్య సాధనలో గూగుల్ పెట్టుబడులు ఒక కీలక మైలురాయిగా నిలిచిపోతాయని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Andhra Pradesh
Visakhapatnam
Google Data Center
Artificial Intelligence
Nara Lokesh
Palla Srinivasa Rao
AP Development
Global AI City
IT Hub

More Telugu News