పనామా కాలువలో భారీ పేలుడు.. బ్రిడ్జిపై అగ్నికీలలు

Panama Canal Fuel Tanker Explosion Near Bridge of the Americas
షార్ట్స్‌లో చూడండి
ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ లాంటి పనామా కాలువ సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పసిఫిక్ మహాసముద్ర ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ప్రఖ్యాత ‘బ్రిడ్జ్ ఆఫ్ ది అమెరికాస్’ కింద జలాల్లో ప్రయాణిస్తున్న ఒక ఇంధన ట్యాంకర్ పేలిపోయింది. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ, అగ్నికీలలతో నిండిపోయింది. ఈ ఘటనతో స్థానికులు, వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

వివరాల్లోకి వెళితే.. వంతెనపై వాహనాల రాకపోకలు కొనసాగుతుండగా కాలువలో వెళుతున్న ఫ్యూయల్ ట్యాంకర్‌ షిప్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే అది పెద్ద శబ్దంతో పేలిపోయింది. దీంతో ఆకాశాన్ని తాకేలా మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాద తీవ్రతకు భయపడిన వాహనదారులు తమ కార్లను వేగంగా నడుపుకుంటూ బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ దుర్ఘటనలో ఇద్దరు పౌరులు, మంటలను ఆర్పేందుకు యత్నించిన ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. మరో వ్యక్తి గల్లంతైనట్లు సమాచారం అందడంతో అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సమీపంలోని ఇతర ఇంధన ట్యాంకులకు మంటలు వ్యాపించకుండా నిరంతరం నీటిని చల్లుతూ పెను ప్రమాదాన్ని నివారించారు.

ప్రపంచ సముద్ర వాణిజ్యానికి కీలకమైన మార్గంలో ఈ ప్రమాదం జరగడంతో ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం పడుతుందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే, ఈ ఘటన కారణంగా కాలువలో నౌకల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదని పనామా అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం పేలుడుకు దారితీసిన కచ్చితమైన కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Panama Canal
Panama Canal explosion
Bridge of the Americas
fuel tanker explosion
Panama fire accident
maritime accident
global trade
Panama shipping
firefighters
maritime safety

More Telugu News