Rishabh Pant: అతడి కష్టం నాకే తెలుసు... రిషభ్ పంత్‌కు అండగా నిలిచిన యువరాజ్

Yuvraj Singh Recalls Rishabh Pants Life Threatening Accident
షార్ట్స్‌లో చూడండి
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న వికెట్ కీపర్-బ్యాటర్ రిషభ్ పంత్‌కు అండ‌గా నిలిచాడు. లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) జట్టుకు కెప్టెన్‌గా ఉన్న పంత్‌.. ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 బంతుల్లో కేవలం 7 పరుగులు మాత్రమే చేసి విఫలమవడంతో అతనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో యువరాజ్ స్పందిస్తూ పంత్‌కు బాసటగా నిలిచాడు.

స్పోర్ట్స్ తక్‌తో మాట్లాడుతూ యువరాజ్ కీల‌క‌ వ్యాఖ్యలు చేశాడు. "పంత్ ప్రాణాంతక ప్రమాదం నుంచి బయటపడ్డాడు. నేను కూడా అలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్నాను. కాబట్టి అతని పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. ప్రస్తుతం అతని మానసిక స్థితి ఎలా ఉందో చాలా మందికి అర్థం చేసుకోవడం కష్టం" అని యువరాజ్ అభిప్రాయపడ్డాడు. పంత్ ఎదుర్కొంటున్న కష్టాలను సామాన్యులు అర్థం చేసుకోలేరని యువీ పేర్కొన్నాడు.

గత రెండేళ్లుగా పంత్ ఎన్నో ఇబ్బందులు పడ్డాడని, కారు ప్రమాదం తర్వాత పలు గాయాలు, సైడ్ స్ట్రెయిన్, ఫుట్ ఫ్రాక్చర్ వంటివి అతడిని వేధించాయని యువరాజ్ తెలిపాడు. వీటివల్ల తన రిథమ్, ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నాయని వివరించాడు. ఈ ఐపీఎల్ సీజన్‌కు ముందు యువరాజ్ వ‌ద్ద పంత్ శిక్షణ తీసుకున్నాడు. ఆ స‌మ‌యంలో తమ మధ్య కీల‌క‌ సంభాషణలు జ‌రిగాయ‌ని అన్నాడు. పంత్ తన తప్పుల నుంచి నేర్చుకుని, ముఖ్యంగా వైట్-బాల్ క్రికెట్‌లో రాణించాలని తపనతో ఉన్నాడని యువీ చెప్పాడు.

కాగా, లక్నో సూపర్ జెయింట్స్ జట్టు నేడు ఉప్ప‌ల్ వేదిక‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనైనా పంత్ తిరిగి ఫామ్ అందుకుంటాడని అతని అభిమానులు ఆశిస్తున్నారు.
Go Back to Shorts
Rishabh Pant
Yuvraj Singh
Delhi Capitals
Lucknow Super Giants
IPL 2024
Indian Cricket
Cricket
Car Accident
Sunrisers Hyderabad
Sports Tak

More Telugu News