Chandrababu Naidu: మైక్రో ఇరిగేషన్‌లో ఏపీ నంబర్ వన్... అధికారులను అభినందించిన సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Congratulates Officials as AP Ranks No 1 in Micro Irrigation
షార్ట్స్‌లో చూడండి
వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను ప్రోత్సహిస్తూ నీటి పొదుపునకు పెద్దపీట వేస్తున్న ఆంధ్రప్రదేశ్, సూక్ష్మ సేద్యం (మైక్రో ఇరిగేషన్) అమలులో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ (APMIP) కింద 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రికార్డు స్థాయిలో 1,26,057 హెక్టార్ల ఆయకట్టును సూక్ష్మ సేద్యం పరిధిలోకి తీసుకొచ్చి జాతీయ స్థాయిలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ ఘనత సాధించడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. నిర్దేశించుకున్న లక్ష్యాలను అధిగమించి రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన ఉద్యానవన శాఖ అధికారులను, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఏపీ తర్వాత 1.05 లక్షల హెక్టార్లతో గుజరాత్ రెండో స్థానంలో నిలిచిందని ఆయన పేర్కొన్నారు. "ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని క్షేత్రస్థాయిలో విజయవంతం చేసిన మీ కృషి అభినందనీయం" అని అధికారులను కొనియాడారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న 1,08,143 మంది రైతులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

డ్రిప్, స్ప్రింక్లర్ వంటి ఆధునిక పద్ధతుల ద్వారా నీటి ఆదాతో పాటు సాగు ఖర్చులు తగ్గించుకుని, అధిక దిగుబడులతో ఆర్థికంగా బలపడాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఈ ప్రాజెక్టు అమలు కోసం ప్రభుత్వం రైతాంగానికి రూ. 1,030 కోట్ల మేర సబ్సిడీని అందించిందని వెల్లడించారు. టమాటా, ఆయిల్ పామ్, మిర్చి నుంచి పప్పు ధాన్యాల వరకు వైవిధ్యమైన పంటలు పండించే రైతులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

మైక్రో ఇరిగేషన్ పథకాన్ని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అర్హులైన ప్రతి రైతుకూ సకాలంలో సబ్సిడీ ప్రయోజనాలు అందేలా పారదర్శక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రానున్న రోజుల్లో మరిన్ని వేల హెక్టార్లను సూక్ష్మ సేద్యం కిందకు తీసుకొచ్చి, ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ ఉద్యాన కేంద్రంగా (గ్లోబల్ హార్టికల్చర్ హబ్) తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Andhra Pradesh
Micro Irrigation
APMIP
Agriculture
Irrigation Project
Horticulture
Farmers
Water Conservation
Subsidy

More Telugu News