Hyderabad: ‘సారీ నాన్నా’ అని లేఖ రాసి.. ఇంట్లోని రూ. 25 లక్షల సొత్తుతో బాలుడి పరారీ!

Hyderabad 17 Year Old Boy Runs Away with Valuables
షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్‌బీ) కాలనీలో ఓ మైనర్ బాలుడి నిర్వాకం తీవ్ర కలకలం రేపింది. 17 ఏళ్ల బాలుడు ఇంట్లోంచి భారీగా నగదు, బంగారం తీసుకుని పరారయ్యాడు. నిన్న‌ జరిగిన ఈ సంఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

వివరాల్లోకి వెళితే.. కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన 17 ఏళ్ల సిద్ధార్థ్ రెడ్డి, తన ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. వెళ్తూ వెళ్తూ బీరువాలో ఉన్న 9 తులాల బంగారం, రూ. 8 లక్షల నగదును తన వెంట తీసుకువెళ్లాడు. అంతేగాక‌ తన తండ్రి నాగార్జున రెడ్డికి చెందిన హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్‌ను కూడా తీసుకెళ్లాడు. అపహరణకు గురైన సొత్తు మొత్తం విలువ సుమారు రూ. 25 లక్షలు ఉంటుందని బాలుడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంట్లోంచి వెళ్లేముందు సిద్ధార్థ్ రెడ్డి ఓ లేఖ కూడా రాసిపెట్టాడు. అందులో ‘సారీ నాన్నా’ అని పేర్కొనడం గమనార్హం. తన తండ్రి బైక్‌ను ఎక్కడో ఒకచోట వదిలేస్తానని కూడా ఆ లేఖలో తెలిపాడు. ప్రస్తుతం అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండటంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వెంటనే వారు కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ కుమారుడు కనిపించడం లేదని, ఇంట్లోంచి నగదు, బంగారం కూడా పోయాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అయితే, సిద్ధార్థ్ రెడ్డి ఇంట్లోంచి పారిపోవడం ఇదే మొదటిసారి కాదని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. గతంలోనూ రెండు సార్లు ఇలాగే ఇంట్లోంచి వెళ్లిపోయి, మళ్లీ కొన్నాళ్లకు తిరిగి వచ్చాడని వారు వివరించారు. ఈసారి మాత్రం భారీగా డబ్బు, బంగారం తీసుకెళ్లడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేపీహెచ్‌బీ పోలీసులు మిస్సింగ్ కేసుతో పాటు చోరీ కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Go Back to Shorts
Hyderabad
Siddharth Reddy
KPHB Colony
Minor Boy
Missing Boy
Theft Case
Bike Theft
Gold Theft
Cash Theft
Telangana Police

More Telugu News