Sameer Rizvi: రిజ్వీ అద్భుత పోరాటం... లక్నో చేతుల్లోంచి గెలుపును లాగేసుకున్న ఢిల్లీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. బుధవారం నాడు లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. కేవలం 26 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచిన ఢిల్లీని, యువ బ్యాటర్ సమీర్ రిజ్వీ (47 బంతుల్లో 70 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) తన అసాధారణ ఇన్నింగ్స్‌తో గెలిపించాడు. ట్రిస్టన్ స్టబ్స్ (32 బంతుల్లో 39 నాటౌట్) అతనికి అండగా నిలిచాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు అజేయంగా 119 పరుగులు జోడించి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు.

లక్నోలోని ఏకానా స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ బౌలర్ల ధాటికి 18.4 ఓవర్లలో 141 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో అబ్దుల్ సమద్ (36), మిచెల్ మార్ష్ (35) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో లుంగి ఎంగిడి, టి. నటరాజన్ చెరో మూడు వికెట్లతో లక్నో పతనాన్ని శాసించగా, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు.

అనంతరం 142 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆరంభం ఆశించిన స్థాయిలో లభించలేదు. కేఎల్ రాహుల్ (0), నితీశ్ రాణా (15), పతుమ్ నిస్సంక (1), కెప్టెన్ అక్షర్ పటేల్ (0) స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేరడంతో ఢిల్లీ 4.3 ఓవర్లలో 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్లిష్ట దశలో క్రీజులో కలిసిన సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్ అద్భుతమైన పోరాటపటిమ కనబరిచారు. లక్నో బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. ముఖ్యంగా రిజ్వీ తన క్లాస్ షాట్లతో అలరించి, ఒత్తిడిలోనూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరి అద్భుత భాగస్వామ్యంతో ఢిల్లీ మరో వికెట్ నష్టపోకుండా 17.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
Sameer Rizvi
Delhi Capitals
Lucknow Super Giants
IPL 2026
Tristan Stubbs
Axar Patel
Cricket
Indian Premier League
Lungi Ngidi
T Natarajan

More Telugu News