Hema actress: ఆ టైమ్ లో చచ్చిపోవాలనిపించింది: నటి హేమ తీవ్ర భావోద్వేగం

“డ్రగ్స్ కేసు వివాదంలో ఆ సమయంలో చచ్చిపోవాలనిపించింది. అంతగా మానసికంగా కుంగిపోయాను” అంటూ ప్రముఖ నటి హేమ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇటీవల డ్రగ్స్ సంబంధిత ఆరోపణల నుంచి క్లీన్ చీట్ పొందిన ఆమె, సోమవారం హైదరాబాద్‌లోని తెలుగు ఫిలిం ఛాంబర్‌లో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనపై వచ్చిన ఆరోపణలు, తాను ఎదుర్కొన్న మానసిక వేదన, కుటుంబం పడిన ఇబ్బందుల గురించి ఆమె ఆవేదనతో మాట్లాడారు.

దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హేమ, డ్రగ్స్ కేసులో తన పేరు రావడం తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. తాను ఎలాంటి తప్పు చేయకపోయినా, నిరాధార ఆరోపణల వల్ల తీవ్రమైన మానసిక నరకాన్ని అనుభవించానని ఆమె తెలిపారు. ఆ క్లిష్ట సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయని చెబుతూ ఆమె కంటతడి పెట్టారు. అయితే, తాను నిర్దోషినన్న నమ్మకంతోనే నిలబడ్డానని, అందుకే చివరికి న్యాయం గెలిచి క్లీన్ చీట్‌తో బయటకు రాగలిగానని స్పష్టం చేశారు.

ఈ వివాదంలో కొన్ని మీడియా సంస్థల పాత్రపై హేమ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజానిజాలు తెలుసుకోకుండా కొన్ని ఛానెళ్లు, పత్రికలు తనపై ఉద్దేశపూర్వకంగా బురదజల్లాయని ఆరోపించారు. బాధ్యతారాహిత్యమైన కథనాల వల్ల తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలగడమే కాకుండా, తన కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా బాధపడ్డారని ఆమె చెప్పారు. “నా కుటుంబం చాలా సఫర్ అయింది. మాకు ఇది చాలా కఠినమైన కాలం. బయటకు వెళ్లలేని పరిస్థితులను ఎదుర్కొన్నాం” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే, మీడియా మొత్తాన్నీ తాను తప్పుపట్టడం లేదని, నిజాయతీగా వార్తలు అందించే సంస్థలు, జర్నలిస్టులు ఉన్నారని హేమ పేర్కొన్నారు. తనకు మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో మీడియా తన విషయంలో న్యాయంగా వ్యవహరిస్తుందన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు, పలువురు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కేసు నుంచి బయటపడిన తర్వాత హేమ నేరుగా మీడియాతో మాట్లాడటం ఇదే తొలిసారి.
Hema actress
Hema Telugu actress
Hema drugs case
Telugu film industry
drugs scandal
film critics association
Hyderabad
Tollywood
meet the press
clean chit

More Telugu News