Mohammed Adnan: విమానంలో కలకలం... గాల్లో ఉండగా డోర్ తెరిచేందుకు ప్రయత్నించిన ప్రయాణికుడు!

Mohammed Adnan Passenger tried opening plane door mid air
షార్ట్స్‌లో చూడండి
బెంగళూరు నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు సృష్టించిన కలకలంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విమానం గాల్లో ఉండగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్‌ను తెరిచేందుకు అతడు రెండుసార్లు ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన పైలట్, ల్యాండింగ్‌ను రద్దు చేసుకుని విమానాన్ని తిరిగి గాల్లోకి తీసుకెళ్లాల్సి వచ్చింది. అనంతరం విమానం సురక్షితంగా ల్యాండ్ అవ్వగా, నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే..  బెంగళూరు నుంచి ఇండిగో విమానం (6E 185) వారణాసికి బయలుదేరగా, ఉత్తరప్రదేశ్‌లోని మౌ జిల్లాకు చెందిన మహ్మద్ అద్నాన్ (22) అనే ప్రయాణికుడు విమానం గాల్లో ఉండగా మొదటిసారి ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన విమాన సిబ్బంది అతడిని హెచ్చరించి, సీటు మార్చారు.

అయితే, విమానం వారణాసిలో ల్యాండ్ అయ్యేందుకు సిద్ధమవుతున్న సమయంలో అద్నాన్ మరోసారి అదే ప్రయత్నం చేశాడు. దీంతో సిబ్బంది వెంటనే పైలట్‌కు సమాచారం అందించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా పైలట్ వెంటనే ల్యాండింగ్‌ను నిలిపివేసి, "గో-అరౌండ్" ప్రక్రియను చేపట్టారు. కొద్దిసేపటి తర్వాత విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది.

అనంతరం అద్నాన్‌ను సీఐఎస్ఎఫ్ సిబ్బందికి అప్పగించగా, వారు ఫూల్‌పూర్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 125 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. విచారణలో అద్నాన్ పొంతనలేని సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. తనకు దెయ్యం పట్టినట్లు ప్రవర్తించానని, ఆ సమయంలో ఏం చేశానో గుర్తులేదని చెప్పినట్లు సమాచారం. ఈ ఘటనపై యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారులు కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.
 
Go Back to Shorts
Mohammed Adnan
Indigo flight
flight emergency exit
Varanasi flight incident
Bengaluru Varanasi
passenger arrested
flight disturbance
aviation safety
flight security
anti terrorism squad

More Telugu News