Nara Lokesh: రికార్డులు సృష్టించాలన్నా.. తిరగరాయాలన్నా టీడీపీతోనే సాధ్యం: మంత్రి నారా లోకేశ్
పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్, అధినేత చంద్రబాబు దేశానికి చేసిన సేవలను లోకేశ్ గుర్తుచేశారు. ‘‘ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు, పాలనా సంస్కరణల గురించి చెప్పాలంటే రోజంతా పడుతుంది. చంద్రబాబు గారికి 75 ఏళ్లు వచ్చినా, ఆయన పనితీరు 25 ఏళ్ల యువకుడి వేగంతో (స్పీడ్ 25) ఉంటుంది’’ అని కొనియాడారు. అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేయడంలో, దళితుడిని లోక్‌సభ స్పీకర్‌గా నిలబెట్టడంలో చంద్రబాబు దార్శనికత గొప్పదని పేర్కొన్నారు.
గత ప్రభుత్వంపై లోకేశ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘‘క్లేమోర్ మైన్లకే భయపడని రక్తం మాది. అలాంటిది అక్రమ కేసులకు భయపడతామా? టీడీపీ అడ్రస్ లేకుండా చేస్తామన్న వాళ్లే ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారు’’ అని అన్నారు. కార్యకర్తల సంక్షేమానికి రూ.150 కోట్లు ఖర్చు చేసిన ఏకైక పార్టీ టీడీపీ అని తెలిపారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలను గ్రామ స్థాయి నుంచి పొలిట్‌బ్యూరో స్థాయికి తీసుకెళతామని హామీ ఇచ్చారు. ప్రజాప్రతినిధులు అహంకారం వీడి ప్రజలతో మమేకం కావాలని, లేదంటే గత పాలకుల గతే పడుతుందని హితవు పలికారు. మాజీ సీఎం జగన్‌పై లోకేశ్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ‘‘జగన్‌కు ‘క్రెడిట్ చోరీ డిజార్డర్’ అనే వింత వ్యాధి వచ్చింది. అందుకే ఇతరుల కష్టాన్ని తన ఖాతాలో వేసుకుంటున్నారు. ఆయన ఈ వ్యాధి నుంచి త్వరగా కోలుకోవాలి’’ అని ఎద్దేవా చేశారు. 2024లో ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని, ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతోందని లోకేశ్ తెలిపారు.
పార్టీ జెండా ఆవిష్కరించి వేడుకలు ప్రారంభించిన చంద్రబాబు
మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్, కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.