KTR: మూసీ ఒడ్డున భారీ హోటళ్లు, బిజినెస్ సెంటర్ల నిర్మాణం ఎందుకు?: కేటీఆర్ నిలదీత

మూసీ ఒడ్డున ఉన్న ఇళ్లు చట్టవిరుద్ధమని చెప్పే ప్రభుత్వం, అదే ప్రాంతంలో భారీ హోటళ్లు, బిజినెస్ సెంటర్లు నిర్మించాలనుకోవడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మూసీ ప్రాజెక్టు పేరుతో లక్షలాది ఇళ్లను కూల్చివేయడానికి, దాదాపు 3 వేల ఎకరాల భూమిని సేకరించి కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడానికి ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి కుంభకోణాలు, అవినీతి గురించి ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మైనింగ్ అక్రమాలను ప్రశ్నిస్తే ప్రతిపక్షాన్ని బెదిరించే ధోరణిలో మాట్లాడారని మండిపడ్డారు. ముఖ్యమంత్రికి బెదిరింపులు అలవాటుగా మారాయని, కానీ ఆయన బెదిరింపులకు బీఆర్ఎస్ భయపడదని గుర్తుంచుకోవాలని అన్నారు.

ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారని, వాటిని అమలు చేయడానికి ఖజానాలో ఒక్క రూపాయి లేదని చెబుతున్న ముఖ్యమంత్రి, మూసీ ప్రాజెక్టు కోసం మాత్రం లక్షన్నర కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పడం విడ్డూరమని అన్నారు. మూసీ ప్రాజెక్టు పేరుతో అక్రమాలకు తెరలేపుతున్నారని ఆరోపించారు. అధికార పార్టీ అవినీతిని ప్రశ్నిస్తే, శివతాండవం చేస్తానని ముఖ్యమంత్రి చెప్పడం విడ్డూరమని అన్నారు. ముఖ్యమంత్రి అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు.
KTR
K Taraka Rama Rao
BRS
Revanth Reddy
Telangana
Moosi River
Moosi Project
Hyderabad

More Telugu News