ఆక్వా, పొగాకు రైతుల కోసం... కేంద్రానికి చంద్రబాబు లేఖలు

Chandrababu Naidu Writes Letters to Center for Aqua Tobacco Farmers
  • ఆక్వా, పొగాకు రైతుల సమస్యలపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖలు
  • రొయ్యల మేత ధరల పెరుగుదలపై జోక్యం చేసుకోవాలని వినతి
  • సిగరెట్లపై పెంచిన పన్నులను పునఃసమీక్షించాలని అభ్యర్థన
  • మేత ధరల నియంత్రణకు నెలవారీ విధానంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు
  • రైతుల ప్రయోజనాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్‌లోని ఆక్వా, పొగాకు రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. వారిని ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి వేర్వేరుగా లేఖలు రాశారు. రొయ్యల మేత ధరల పెరుగుదల, పొగాకుపై అధిక పన్నుల భారం వంటి కీలక అంశాలపై తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఆక్వా రైతులకు ఊరట కల్పించండి..
రాష్ట్రంలో రొయ్యల మేత ధరలు విపరీతంగా పెరగడంపై ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు లేఖ రాశారు. 2026 జనవరి నుంచి మే మధ్య కాలంలో సోయా, ఫిష్ మీల్ వంటి ముడిసరుకుల ధరలు 20 శాతానికి పైగా పెరిగాయని, దీంతో మేత తయారీ ఖర్చు కిలోకు రూ.31కి పైగా పెరిగిందని లేఖలో ప్రస్తావించారు. ముడిసరుకుల ధరలు తగ్గినప్పుడు రైతులకు ప్రయోజనం బదిలీ చేయని కంపెనీలు, ఇప్పుడు భారాన్ని మోపడం సరికాదని రైతులు వాదిస్తున్నారని తెలిపారు. 

ఈ నేపథ్యంలో ఫిష్ మీల్ ఎగుమతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని, సోయా దిగుమతులపై ఆంక్షలు సడలించాలని కేంద్రాన్ని కోరారు. మరోవైపు, పౌల్ట్రీ తరహాలో ముడిసరుకుల ధరల ఆధారంగా మేత ధరలను ప్రతి నెలా సమీక్షించే విధానాన్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.

పొగాకు రైతులను ఆదుకోండి..
ఇదే సమయంలో, ఎఫ్‌సీవీ పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపైనా సీఎం దృష్టి సారించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు వేర్వేరు లేఖలు రాశారు. సిగరెట్లపై జీఎస్టీ, ఎక్సైజ్ డ్యూటీని భారీగా పెంచడం వల్ల కొనుగోళ్లు మందగించాయని, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వివరించారు. 

గతేడాది వేలంలో కిలోకు రూ.280 ఉన్న ప్రారంభ ధర, ఈ ఏడాది రూ.250కి పడిపోయిందని తెలిపారు. ఈ పన్నుల విధానం వల్ల 43 వేల మంది రైతులు, లక్షలాది మంది కార్మికుల జీవనోపాధి ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు పెంచిన పన్నులను పునఃసమీక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు కోరారు.


Go Back to Shorts
Chandrababu Naidu
Andhra Pradesh
Aqua farmers
Tobacco farmers
Aqua feed prices
Tobacco taxes
FCV tobacco
Fisheries
Agriculture
Nirmala Sitharaman

More Telugu News