Nara Lokesh: నిజం నిప్పులాంటిది... ఈ రోజు గెలిచింది: అసెంబ్లీలో మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Speech in Assembly on Amaravati as Sole Capital
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని నిర్ధారిస్తూ శనివారం నిర్వహించిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. గత ఐదేళ్లలో అమరావతిపై జరిగిన కుట్రలను, రైతులు, మహిళలు చేసిన అలుపెరుగని పోరాటాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. నిజం నిప్పులాంటిది... ఈ రోజు గెలిచిందని అన్నారు. ఒకే రాజధాని, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి అనేదే తమ ప్రభుత్వ విధానమని ఆయన పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంపై, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ముందుచూపుతో అమరావతి నిర్మాణం
రాజధాని అనేది కేవలం పరిపాలనా కేంద్రంగా కాకుండా, ఒక ఆర్థిక చోదక శక్తిగా ఉండాలని మంత్రి లోకేశ్ అన్నారు. "హైదరాబాద్‌ను నిజాం, సికింద్రాబాద్‌ను బ్రిటిష్ వారు నిర్మిస్తే, ముందుచూపుతో సైబరాబాద్‌ను నిర్మించిన దార్శనికుడు చంద్రబాబు నాయుడు. భవిష్యత్తులో ఢిల్లీ ఎదుర్కొంటున్న కాలుష్య సమస్యలు, బెంగళూరు పడుతున్న ట్రాఫిక్ కష్టాలు మన రాజధానికి రాకూడదనే ఉద్దేశంతో పక్కా పర్యావరణహిత వ్యవస్థతో అమరావతిని నిర్మించాలని సంకల్పించారు. ప్రపంచమంతా ఆశ్చర్యపోయేలా అత్యుత్తమ ప్రమాణాలతో సింగపూర్ ప్రభుత్వ సహకారంతో మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్స్‌తో సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ డిజైన్లను సిద్ధం చేయించారు" అని లోకేశ్ వివరించారు.

టీడీపీ హయాంలో అభివృద్ధి వికేంద్రీకరణ
అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపింది చంద్రబాబు ప్రభుత్వమేనని లోకేశ్ స్పష్టం చేశారు. "కియా మోటార్స్ రాకముందు అనంతపురం అత్యంత వెనుకబడిన జిల్లా. కానీ, చంద్రబాబు కృషితో కియా పరిశ్రమ రావడంతో పాటు, దాని అనుబంధ సంస్థలు కూడా వచ్చాయి. పంటలు పండని నేలపై కార్ల పంట పండించారు. ఫలితంగా, అనంతపురం నేడు తలసరి ఆదాయంలో రాష్ట్రంలోనే టాప్-5లో నిలిచింది. అదేవిధంగా, రాయలసీమలో డ్రిప్ ఇరిగేషన్, హార్టికల్చర్ మిషన్‌ను ప్రోత్సహించి రైతుల జీవితాల్లో వెలుగులు నింపారు. ఉత్తరాంధ్రకు ఐటీ, మెడికల్ డివైజ్ పరిశ్రమలను తెచ్చి ఆ ప్రాంత అభివృద్ధికి బాటలు వేశారు" అని గుర్తుచేశారు.

జగన్ అబద్ధాలు, మూడు ముక్కలాట
నిజం చేదుగా, అబద్ధం తీయగా ఉంటుందని, ఆనాడు జగన్ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని లోకేశ్ ధ్వజమెత్తారు. "తాను కూడా ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నానని, అమరావతిని కదిలించే ప్రసక్తే లేదని నమ్మబలికి 151 సీట్లు గెలుచుకున్నారు. కానీ, గెలిచిన వెంటనే మాట మార్చి మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట మొదలుపెట్టారు. అమరావతిని పూర్తిగా నాశనం చేశారు. ఉత్తరాంధ్రలో ఒక్క పరిశ్రమ తేలేదు, కర్నూలుకు కనీసం హైకోర్టు బెంచ్ కూడా తరలించలేదు. కానీ, తన కోసం రూ. 700 కోట్లతో ప్యాలెస్ నిర్మించుకున్నారు. అందుకే ప్రజలు 151 సీట్లను 11కి పరిమితం చేశారు. ఈ సభాముఖంగా జగన్‌ను డిమాండ్ చేస్తున్నా, అమరావతి రైతులకు, రాష్ట్ర ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాలి" అని లోకేశ్ నిలదీశారు.

రైతులు, మహిళల అలుపెరుగని పోరాటం
మూడు రాజధానుల ప్రకటన తర్వాత అమరావతి రైతులు, మహిళలు చేసిన పోరాటాన్ని లోకేశ్ గుర్తుచేసుకున్నారు. "5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం 1631 రోజుల పాటు వారు ఉద్యమించారు. గడప దాటని మహిళలు రోడ్లపైకి వచ్చి పోరాడారు. వారిని బూటుకాళ్లతో తన్నారు, జుట్టుపట్టుకుని ఈడ్చారు. భూములు త్యాగం చేసిన దళిత రైతులకు సంకెళ్లు వేసి జైల్లో పెట్టారు. ప్రశ్నించిన మీడియాపై కేసులు పెట్టారు. ఈటీవీ విలేకరిపై అటెంప్ట్ రేప్ కేసు నమోదు చేశారు. ఆనాటి స్పీకర్ తమ్మినేని సీతారాం ఉద్యమకారులైన మహిళలను వేశ్యలతో పోల్చారు. జగన్ వారిని పెయిడ్ ఆర్టిస్టులని అవమానించారు. ఎన్ని చేసినా ఉద్యమం ఆగలేదు" అని లోకేశ్ భావోద్వేగంతో ప్రసంగించారు.

శాసనమండలిలో హోరాహోరీ పోరాటం
రాజధాని బిల్లు శాసనమండలికి వచ్చినప్పుడు తాము చేసిన పోరాటాన్ని లోకేశ్ వివరించారు. "ఆనాడు మాకు బలం సరిపోకపోయినా మండలిలో బిల్లును అడ్డుకున్నాం. యనమల రామకృష్ణుడు గారి నేతృత్వంలో బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని డివిజన్ కోరాం. ఆ సమయంలో వైసీపీ మంత్రులు, సభ్యులు గ్యాలరీలోకి వచ్చి చంద్రబాబు గారిని చుట్టుముట్టి దాడికి యత్నించారు. మా ఎమ్మెల్యేలు ఆయనకు రక్షణ కవచంలా నిలబడ్డారు. సెలెక్ట్ కమిటీకి పంపుతున్నామని ప్రకటించినందుకు చైర్మన్ షరీఫ్ గారిపై మంత్రులు దాడి చేశారు. చైర్మన్ ఆమోదం లేకుండానే బిల్లును గవర్నర్‌కు పంపించారు. ఇంతటి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడ్డారు" అని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.

వ్యవస్థల విధ్వంసం, రాష్ట్రానికి తీరని నష్టం
వ్యవస్థలను గౌరవించడం ప్రజాస్వామ్యంలో కీలకమని లోకేశ్ అన్నారు. "మనలో ఎవరూ శాశ్వతం కాదు, కానీ వ్యవస్థలు శాశ్వతం. చంద్రబాబు తర్వాత వచ్చిన ఎందరో ముఖ్యమంత్రులు హైదరాబాద్ అభివృద్ధిని కొనసాగించారు. కానీ, ఏపీలో ఒక్క వ్యక్తి విధ్వంసం కారణంగా రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయింది. ఈరోజు పారిశ్రామికవేత్తలు మమ్మల్ని 'మళ్లీ జగన్ రాడని గ్యారెంటీ ఇస్తారా?' అని అడుగుతున్నారు. ఆయన పాలన లేకపోయి ఉంటే దేశానికి వచ్చే రూ. 100 పెట్టుబడులలో రూ. 50 ఏపీకే వచ్చుండేవి" అని ఆయన అన్నారు.

అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఇదే!
అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఒక ప్రాంతంలో రాజధానిని ఉంచి, అన్ని ప్రాంతాలకు పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు తీసుకురావడమేనని లోకేశ్ స్పష్టం చేశారు. "క్లస్టర్ ఆధారిత అభివృద్ధి ప్రణాళికతో ప్రతి జిల్లాను అభివృద్ధి చేస్తాం. అనంతపురాన్ని ఆటోమోటివ్ హబ్‌గా, కర్నూలును పునరుత్పాదక ఇంధన హబ్‌గా, కడప, చిత్తూరులను ఎలక్ట్రానిక్స్ హబ్‌లుగా, నెల్లూరును మారిటైమ్ సెక్యూరిటీ హబ్‌గా, ఉత్తరాంధ్రను స్టీల్, ఫార్మా, ఐటీ, డేటా హబ్‌గా తీర్చిదిద్దుతాం. ఉభయ గోదావరి జిల్లాలను ఆక్వా, గ్రీన్ ఎనర్జీ హబ్‌లుగా మారుస్తాం. ఇది నిజమైన అభివృద్ధి వికేంద్రీకరణ, ఒక వ్యక్తి కోసం ప్యాలెస్ కట్టుకోవడం కాదు" అని లోకేశ్ వివరించారు.

డబుల్ ఇంజన్ సర్కార్... జగన్‌కు సవాల్
ప్రస్తుతం రాష్ట్రంలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాయని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. "కేంద్రం ఇప్పటికే అమరావతికి రూ. 16 వేల కోట్ల గ్రాంటు ప్రకటించింది. గూగుల్ డేటా సెంటర్, ఆర్సెల్లర్ మిట్టల్ వంటి పెద్ద ప్రాజెక్టులకు ఉన్న అడ్డంకులను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రధానితో మాట్లాడి తొలగించారు. ఇదే డబుల్ ఇంజన్ సర్కార్ పవర్. కానీ, జగన్ మాత్రం తన దొంగ పేపర్, చానల్ ద్వారా మళ్లీ దొంగ మాటలు చెప్పడానికి పాదయాత్ర అంటున్నాడు" అంటూ లోకేశ్ ధ్వజమెత్తారు. చివరగా, ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన అమరావతి తీర్మానాన్ని బలపరుస్తున్నానని, ఈ తీర్మానానికి పార్లమెంటు ఆమోదం కూడా లభించాలని ఆకాంక్షిస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.
Go Back to Shorts
Nara Lokesh
Amaravati
Andhra Pradesh
Chandrababu Naidu
Jagan Mohan Reddy
AP Assembly
Capital City
Political Speech
TDP
YS Jagan

More Telugu News