YS Sharmila: అమరావతి చట్టబద్ధతను స్వాగతిస్తూనే... ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించిన షర్మిల
అమరావతిని చట్టబద్ధ రాజధానిగా గుర్తించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని రాష్ట్ర వైసీపీ చీఫ్ షర్మిల స్వాగతించారు. ఇదే సమయంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ఆమె ప్రశ్నలు కురిపించారు. "కేవలం గెజిట్ నోటిఫికేషన్‌లో పేరు ఉంటే సరిపోతుందా? రాజధాని నిర్మాణానికి కావాల్సిన లక్ష కోట్ల నిధులు ఎక్కడి నుంచి వస్తాయి?" అని ఆమె నిలదీశారు.
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదేనని షర్మిల స్పష్టం చేశారు. సెక్షన్ 94(3d) ప్రకారం కేంద్రం ఎంత ఖర్చయినా భరించాల్సి ఉందన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోయిందా..? అని ప్రశ్నించారు. రాజధాని కోసం కేంద్రం ఇస్తున్న అప్పులను 'ముష్టి'గా అభివర్ణించారు. హక్కుగా రావాల్సిన నిధుల కోసం అసెంబ్లీలో ఎందుకు తీర్మానం చేయడం లేదని ఆమె నిలదీశారు.
ప్రధాని మోదీ గతంలో అమరావతికి 'చెంబుడు నీళ్లు, తట్టెడు మట్టి' ఇచ్చారు... బీజేపీ ఇస్తున్న అరకొర సాయంతోనే రాజీపడదామా? అని ఆమె ఘాటుగా విమర్శించారు. నిధులు అడగకుండా కేవలం చట్టబద్ధత పేరుతో కాలక్షేపం చేస్తూ రాజధాని నిర్మాణ భారాన్ని ఏపీ ప్రజల నెత్తిపై వేయడం సరైంది కాదని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ భవిష్యత్తులో జగన్ వంటి వారు వచ్చినా రాజధాని మారకుండా ఉండేందుకు ఉపయోగపడవచ్చు కానీ, నిధులు లేకుండా అమరావతి కల సాకారం కాదని షర్మిల స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన తాను సంధిస్తున్న ఈ ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.