Jaish-e-Mohammed: నిధులు లేక నేరాల బాటపడుతున్న జైషే టెర్రరిస్టులు!

Jaish e Mohammed Terrorists Turn to Crime Due to Lack of Funds
షార్ట్స్‌లో చూడండి
ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (జేఈఎమ్) తన కార్యకలాపాల కోసం సరికొత్త, ప్రమాదకరమైన వ్యూహానికి తెరతీసింది. భద్రతా దళాల ఆపరేషన్లతో తీవ్రంగా దెబ్బతినడం, పాకిస్థాన్ నుంచి నిధుల ప్రవాహం పూర్తిగా నిలిచిపోవడంతో.. స్థానికంగానే డబ్బు సంపాదించాలని తన కేడర్‌ను ఆదేశించింది. జమ్మూకశ్మీర్‌తో పాటు పంజాబ్, హర్యానా, ఢిల్లీ నగరాల్లోని ధనవంతులను లక్ష్యంగా చేసుకుని కిడ్నాపులు, బెదిరింపు వసూళ్లకు పాల్పడాలని ప్రణాళికలు రచిస్తున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

గతంలో జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’లో జైషే మహ్మద్ నెట్‌వర్క్ చిన్నాభిన్నమైంది. సంస్థ చీఫ్ మసూద్ అజర్‌ కుటుంబసభ్యులు కూడా పలువురు హతమయ్యారు. దీనికి తోడు, సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేయడంతో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) నుంచి ఉగ్రవాదుల చొరబాట్లు దాదాపు అసాధ్యంగా మారాయి. ఈ నేపథ్యంలో నిధుల కొరతతో సతమతమవుతున్న జైషే సంస్థ, తన ఓవర్ గ్రౌండ్ వర్కర్లను (ఓడబ్ల్యూజీ) రంగంలోకి దించింది.

ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారుల ప్రకారం, జమ్మూకశ్మీర్‌తో పాటు పంజాబ్, హర్యానా, ఢిల్లీలోని సంపన్నుల జాబితాను సిద్ధం చేసి, వారిని బెదిరించి డబ్బులు గుంజేందుకు ఈ వర్కర్లు ప్రయత్నిస్తున్నారు. అవసరమైతే వారి పిల్లలను కిడ్నాప్ చేసి భారీగా డబ్బు డిమాండ్ చేయాలని కూడా చూస్తున్నారు. ఇలా సమకూరిన డబ్బుతో కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాద కార్యకలాపాలను ముమ్మరం చేయాలన్నది వారి ప్రణాళిక.

ఇటీవల పంజాబ్‌లోని మొహాలీలో ఓ డ్రైవర్‌ను హత్య చేసి, కారును దొంగిలించిన కేసులో జైషే మాడ్యూల్‌ను పోలీసులు ఛేదించారు. నిధుల సేకరణ కోసమే ఈ దోపిడీకి పాల్పడినట్టు దర్యాప్తులో తేలింది. ఈ ఘటన రాబోయే ముప్పునకు ఒక సంకేతం మాత్రమేనని, ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. కేవలం నిధుల సేకరణే కాకుండా, ఐఎస్ఐ ఆదేశాల మేరకు సరిహద్దు రాష్ట్రాల్లో బలహీనంగా ఉన్న వ్యక్తులను గుర్తించి, గూఢచర్య నెట్‌వర్క్‌లోకి లాగే ప్రయత్నాలు కూడా జైషే చేస్తోందని అధికారులు తెలిపారు.


Go Back to Shorts
Jaish-e-Mohammed
JeM
Masood Azhar
terrorism funding
Jammu Kashmir
Punjab
kidnapping
extortion
ISI
terrorist financing

More Telugu News