KP Sharma Oli: నేపాల్ రాజకీయాల్లో ప్రకంపనలు.. మాజీ ప్రధాని ఓలీ అరెస్ట్

Nepal Ex PM KP Sharma Oli Arrested Over Protest Violence
షార్ట్స్‌లో చూడండి
నేపాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీని పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది జరిగిన 'జెన్ జీ' నిరసనల సందర్భంగా చోటుచేసుకున్న హింస, మరణాలకు సంబంధించి ఆయనపై ఈ చర్యలు తీసుకున్నారు. ర్యాపర్ నుంచి రాజకీయ నేతగా మారిన బలేంద్ర షా కొత్త ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఈ అరెస్ట్ జరగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఓలీతో పాటు మాజీ హోం మంత్రి రమేశ్ లేఖక్‌ను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

"ఈ ఉదయం వారిని అరెస్ట్ చేశాం. చట్టప్రకారం తదుపరి విచారణ కొనసాగుతుంది" అని ఖాట్మండు వ్యాలీ పోలీస్ ప్రతినిధి ఓం అధికారి మీడియాకు తెలిపారు. ఈ అరెస్ట్‌లపై ప్రస్తుత హోం మంత్రి సుదన్ గురుంగ్ 'ఎక్స్' వేదికగా స్పందించారు. "ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. చట్టానికి ఎవరూ అతీతులు కాదు. ఇది కక్షసాధింపు చర్య కాదు, న్యాయం వైపు వేసిన ముందడుగు. దేశం ఇక కొత్త దిశలో పయనిస్తుంది" అని ఆయన పేర్కొన్నారు.

గతేడాది సెప్టెంబర్‌లో అవినీతికి వ్యతిరేకంగా జరిగిన 'జెన్ జీ' నిరసనలు హింసాత్మకంగా మారాయి. రెండు రోజుల పాటు జరిగిన అల్లర్లలో 70 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి ఓలీ ప్రభుత్వం కుప్పకూలింది. నిరసనలపై గతంలో ఏర్పాటు చేసిన కమిషన్ ఇచ్చిన నివేదికను శుక్రవారం జరిగిన తొలి క్యాబినెట్ సమావేశంలోనే అమలు చేయాలని నిర్ణయించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి కూడా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు ఓలీ, లేఖక్‌లకు గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష విధించాలని కమిషన్ సిఫార్సు చేసినట్లు సమాచారం.
Go Back to Shorts
KP Sharma Oli
Nepal Politics
Arrest
Balendra Shah
Ramesh Lekhak
Gen Z Protests
Kathmandu
Corruption
Government
Investigation

More Telugu News