Virat Kohli: ఐపీఎల్‌కు ముందు కోహ్లీ కొత్త టాటూ.. దాని అర్థం ఏంటో తెలుసా?

Virat Kohli New Tattoo Before IPL 2026 Know Its Meaning
షార్ట్స్‌లో చూడండి
టీమిండియా స్టార్ బ్యాటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఆటగాడు విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు కొత్త లుక్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. తన ఎడమ చేతి నిండా సరికొత్తగా ఫుల్ స్లీవ్ టాటూ వేయించుకున్నాడు. ముంబైకి చెందిన ప్రముఖ 'ఏలియన్స్ టాటూ ఇండియా' స్టూడియోలో కోహ్లీ ఈ టాటూను వేయించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా, అది క్షణాల్లో వైరల్‌గా మారింది.

రేప‌టి నుంచి ఐపీఎల్ 19వ ఎడిషన్ ప్రారంభం కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ కీలకమైన టోర్నీకి ముందు కోహ్లీ వేయించుకున్న ఈ టాటూ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఈ టాటూ వెనుక ఉన్న అర్థాన్ని ఏలియన్స్ టాటూ సంస్థ తమ వెబ్‌సైట్‌లో వివరించింది. "ఇది కేవలం మరో కొత్త టాటూ కాదు. కోహ్లీ వ్యక్తిగా ఎలా ఎదిగాడు, అతని ప్రయాణం ఏంటి అనే లోతైన అర్థాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. అతని జీవితంలోని పరివర్తనకు ఇది అద్దం పడుతుంది" అని పేర్కొంది. జీవితంలోని ప్రతి దశలోనూ క్రమశిక్షణ, ఏకాగ్రత, అచంచలమైన నమ్మకంతో పాత అలవాట్లను, ఆలోచనలను వదిలేశాడని, కొన్నింటిని మరింత బలోపేతం చేసుకున్నాడని, మరిన్ని కొత్త నమ్మకాలను తన వ్యక్తిత్వంలో చేర్చుకున్నాడని తెలిపింది. వాటన్నిటికీ ఈ టాటూ ప్రతీక అని వివరించింది.

కోహ్లీ ఎడమ చేయి ఖాళీ కాన్వాస్ కాదని, దానిపై ఇప్పటికే వేర్వేరు దశలకు చెందిన పాత టాటూలు ఉన్నాయని ఆర్టిస్టులు తెలిపారు. వాటిలో కొన్ని కాలక్రమేణా స్పష్టత కోల్పోయాయని, మరికొన్ని ప్రస్తుత అతని వ్యక్తిత్వానికి సరిపోలడం లేదని అన్నారు. అందుకే కొన్ని పాత టాటూలను పూర్తిగా కవర్ చేస్తూ, మరికొన్నింటిని మెరుగుపరుస్తూ, కొత్త ఎలిమెంట్స్‌ను జోడించి ఒకే కథగా చెప్పేలా ఈ ఫుల్ స్లీవ్ టాటూను పూర్తి చేసినట్లు వారు వెల్లడించారు. పాత, కొత్త టాటూల కలయికతో అతని జీవిత ప్రయాణాన్ని తెలిపేలా దీనిని తీర్చిదిద్దినట్లు వివరించారు.
Go Back to Shorts
Virat Kohli
Kohli new tattoo
IPL 2026
Royal Challengers Bangalore
RCB
Aliens Tattoo India
tattoo meaning
Indian Premier League
SRH
Sunrisers Hyderabad

More Telugu News