ముద్రగడ పద్మనాభంతో అంబటి రాంబాబు భేటీ
ఏపీ రాజకీయాల్లో కాపు సామాజికవర్గ సమీకరణాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంను మాజీ మంత్రి అంబటి రాంబాబు కలిశారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ ముద్రగడ పట్టుదల, నిజాయతీని ప్రశంసించారు. గతంలో ముద్రగడ కుటుంబాన్ని పోలీసులు ఇబ్బంది పెట్టారంటూ, ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ముద్రగడ తమ కాపు కులంలో పుట్టినందుకు గర్విస్తున్నానని చెప్పారు.
తనపై ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనక్కి తగ్గేది లేదని, తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటానని ఆంబటి స్పష్టం చేశారు. ముఖ్యంగా పోలీసులు తనను హింసించారని, అర్ధరాత్రి వేళల్లో ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. బెయిల్ వచ్చిన తర్వాత కూడా మళ్లీ కేసు పెట్టారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లను వదిలేది లేదని హెచ్చరించారు. తన పార్టీ, తన కులంతో కలిసి దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.