Komatireddy Venkat Reddy: ఎల్బీనగర్-హయత్ నగర్ మధ్య డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్

LB Nagar Hayath Nagar to Get Double Decker Flyover Says Komatireddy
షార్ట్స్‌లో చూడండి
నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు నాగ్‌పూర్ తరహాలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మించనున్నట్లు ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. మంగళవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. రూ.941 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే ఈ ప్రాజెక్టుకు నెల రోజుల్లో కేంద్ర ప్రభుత్వ ఆమోదం తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఎల్బీనగర్-హయత్ నగర్ మధ్య 65కి పైగా కాలనీల్లో సుమారు 10-12 లక్షల జనాభా నివసిస్తోందని, వాహనాల రద్దీతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో 5.5 కిలోమీటర్ల పొడవునా ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌ను ప్రతిపాదించినట్లు వివరించారు. దీనివల్ల హైదరాబాద్-విజయవాడ ప్రయాణ సమయం కూడా తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు వ్యయంలో కేంద్రం రూ.741 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లు భరిస్తాయని చెప్పారు. ఆరు నెలల్లో టెండర్లు ఖరారు చేసి, పనులు మొదలయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు.

ఇదే సమయంలో రాష్ట్రంలోని ఇతర రహదారుల అభివృద్ధిపైనా మంత్రి మాట్లాడారు. హైదరాబాద్-శ్రీశైలం రహదారిలో మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు 52 కిలోమీటర్ల మేర రూ.7,600 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ప్రతిపాదనలు కేంద్రానికి పంపినట్లు తెలిపారు. రాష్ట్రంలో మట్టి రోడ్లు లేకుండా అన్నింటినీ బీటీ రోడ్లుగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. తొలి దశలో రూ.13 వేల కోట్లతో 6,092 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని, హైబ్రిడ్ యాన్యునిటీ మోడ్ (హ్యామ్) పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ఈ నెలాఖరుకు పూర్తి కానుందని, మే నుంచి పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని వివరించారు.
Go Back to Shorts
Komatireddy Venkat Reddy
LB Nagar
Hayath Nagar
Double Decker Flyover
Hyderabad Traffic
Telangana Roads
Road Development
Central Government
Vijayawada
Srisailam Highway

More Telugu News