Chandrababu Naidu: ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధం: పెట్రోల్, డీజిల్ పై అధికారులను అప్రమత్తం చేసిన సీఎం చంద్రబాబు

Chandrababu Naidu alerts officials on petrol diesel due to Iran Israel war
షార్ట్స్‌లో చూడండి
ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రపంచ సరఫరా గొలుసుపై (గ్లోబల్ సప్లయ్ చైన్) తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, ఎరువుల కొరత ఏర్పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సంక్షోభం ముదరకముందే అప్రమత్తంగా వ్యవహరించాలని, అవసరమైన నిల్వల కోసం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని స్పష్టం చేశారు.

భవిష్యత్తులో ఇంధన సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కార మార్గాలపై దృష్టి సారించాలని సూచించారు. ఇండక్షన్ స్టవ్‌లు, పైపుల ద్వారా గ్యాస్ సరఫరా (పీఎన్‌జీ), ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) వంటి ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడం ద్వారా ఇంధన భద్రతను పటిష్ఠం చేయాలని స్పష్టం చేశారు. ఎల్పీజీ సరఫరా వ్యవస్థను సమీక్షిస్తూ... గ్రామీణ, గిరిజన ప్రాంతాలతో పాటు విద్యా సంస్థలు, ఆలయాలకు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం దిశానిర్దేశం చేశారు.

అమరావతిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమావేశంలో, రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై కూడా ఆయన వరుసగా రెండో రోజూ సమీక్ష నిర్వహించారు. భారీ గాలులు, వడగళ్లతో కూడిన వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన నష్టం వివరాలను అధికారులు సీఎంకు వివరించారు.

రాష్ట్రంలోని 12 జిల్లాల్లోని 42 మండలాల్లో 4,840 హెక్టార్లలో మొక్కజొన్న, 1,534 హెక్టార్లలో వరి, 310 హెక్టార్లలో మినుము పంటలు దెబ్బతిన్నాయని, దీని విలువ సుమారు రూ.40 కోట్లుగా ఉంటుందని తెలిపారు. అలాగే, 9 జిల్లాల్లోని 48 మండలాల్లో 1,301 హెక్టార్లలో అరటి, బొప్పాయి, మిరప, మామిడి, నిమ్మ, నారింజ వంటి ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్టు పేర్కొన్నారు. ఈ నష్టం విలువ రూ.22.68 కోట్లుగా అంచనా వేశారు. మొత్తం మీద రాష్ట్రవ్యాప్తంగా రూ.62 కోట్లకు పైగా పంట నష్టం వాటిల్లినట్టు అధికారులు నివేదించారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Iran Israel conflict
petrol diesel shortage
Andhra Pradesh
fuel crisis
CM Chandrababu
global supply chain
crop damage
untimely rains

More Telugu News