Sanju Samson: "మొదటి బంతికే బాదేస్తా".. ద్రవిడ్ ప్రశ్నకు సూర్యవంశీ సమాధానం.. ఫన్నీ స్టోరీ చెప్పిన సంజూ శాంసన్

Sanju Samson Narrates Vaibhav Suryavanshi Rahul Dravid Interaction
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి మధ్య జరిగిన ఓ సరదా సంభాషణను స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ బయటపెట్టారు. గత ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున సూర్యవంశీ అరంగేట్రం చేయడానికి ముందు జరిగిన ఈ సంఘటన గురించి సంజూ చెప్పిన తీరు అందరినీ నవ్వించింది. బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రదానోత్సవంలో ఈ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ వేడుకలో సంజూ శాంసన్ మాట్లాడుతూ.. "ఆ సమయంలో నేను, రాహుల్ సర్ ఒక మీటింగ్‌లో ఉన్నాం. అప్పుడు సర్ నాతో, 'సంజూ, మనం అతనితో మాట్లాడాలి. అతను చాలా చిన్న పిల్లాడు, ఎలా ఆడాలో కాస్త మార్గనిర్దేశం చేయాలి' అని అన్నారు. ఆ తర్వాత రాహుల్ సర్.. వైభవ్‌ను పిలిచి 'వైభవ్, నీ ప్లాన్ ఏంటి?' అని అడిగారు. దానికి అతను 'ఏం లేదు సార్, నేను వెళ్లి ఆడతాను' అని సింపుల్‌గా చెప్పాడు" అని వివరించారు.

అంతటితో ఆగకుండా, "రాహుల్ సర్ మళ్లీ 'నీ గేమ్ ప్లాన్ ఏంటి?' అని అడిగితే, 'నాకు తొలి బంతి ఎదురైతే, దాన్ని బాదేస్తాను' అని సమాధానమిచ్చాడు. అది విని నేను 'ఇతను వేరే ఏదో వీడియో గేమ్ ఆడుతున్నాడు' అనుకున్నాను" అని సంజూ చెప్పడంతో సభలో ఉన్నవారంతా ఒక్కసారిగా నవ్వేశారు. గంభీరంగా ఉండే రాహుల్ ద్రవిడ్ కూడా తన నవ్వును ఆపుకోలేకపోయారు.

గత ఐపీఎల్ సీజన్‌లో అరంగేట్రం చేసిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, తన మాటలను నిజం చేస్తూ అద్భుతంగా రాణించాడు. కేవలం 7 మ్యాచ్‌లలో 206.56 స్ట్రైక్ రేట్‌తో 252 పరుగులు చేశాడు. గుజరాత్ టైటాన్స్‌పై కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు.

ఈ అవార్డుల కార్యక్రమానికి బీసీసీఐ ఉన్నతాధికారులు, ఐసీసీ ఛైర్మన్ జై షా హాజరయ్యారు. ఈ వేదికపై రాహుల్ ద్రవిడ్, రోజర్ బిన్నీ, మిథాలీ రాజ్‌లకు కల్నల్ సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులను ప్రదానం చేశారు. 
Sanju Samson
Rahul Dravid
Vaibhav Suryavanshi
IPL
Rajasthan Royals
BCCI Awards
Cricket
Indian Cricket
T20 Cricket
Cricket Story

More Telugu News