Sangareddy: సంగారెడ్డి జిల్లాలో తేనెటీగల బీభత్సం.. 15 మందికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం

Sangareddy Bee Attack Leaves 15 Injured One Critical
సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో శుక్రవారం ఉదయం తేనెటీగలు బీభత్సం సృష్టించాయి. గ్రామ పాఠశాల సమీపంలోని మర్రిచెట్టుపై ఉన్న భారీ తేనెతుట్టె నుంచి ఒక్కసారిగా విరుచుకుపడి, దారిన వెళ్తున్న వారిపై దాడి చేశాయి. ఈ హఠాత్ పరిణామంతో గ్రామస్థులు, పాఠశాల విద్యార్థులు ప్రాణభయంతో పరుగులు తీశారు.

గత కొన్ని రోజులుగా మర్రిచెట్టుపై ఉన్న తేనెతుట్టె నుంచి శుక్రవారం ఉదయం ఎండ వేడికి తాళలేక వందలాది ఈగలు ఒక్కసారిగా కిందికి వచ్చాయి. ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న వారిని, ఇళ్ల ముందు ఉన్నవారిని వెంబడించి కుట్టాయి. ఈ దాడిలో నలుగురు పాఠశాల విద్యార్థులు గాయపడ్డారు. తేనెటీగలు స్కూల్‌లోకి ప్రవేశించకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

అయితే, బైక్‌పై వెళ్తున్న సుధాకర్ అనే యువకుడిని వందలాది తేనెటీగలు చుట్టుముట్టాయి. వాటి నుంచి తప్పించుకోవడానికి పక్కనే ఉన్న డ్రమ్ములోని నీటిని తలపై పోసుకున్నా ప్రయోజనం లేకపోయింది. తేనెటీగలు ముఖం, శరీరంపై విపరీతంగా కుట్టడంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. గ్రామస్థులు వెంటనే అతడిని సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం సంగారెడ్డిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సుధాకర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఈ భయానక ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. జనం పరుగులు తీస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తేనెటీగల భయంతో గ్రామస్థులు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి తేనెతుట్టెను తొలగించాలని కోరుతున్నారు.
Sangareddy
Sudhakar
Sadasivpet
Telangana
Bee attack
Honey bees
Venkatapur village
School children injured
Viral video
Accident

More Telugu News