పవన్ కల్యాణ్ క్యాబినెట్ సమావేశానికి హాజరుకాకపోవడంపై రోజా స్పందన

Roja Reacts to Pawan Kalyans Absence at Cabinet Meeting
  • నేడు ఏపీ క్యాబినెట్ సమావేశం.. పవన్ గైర్హాజరు
  • మరో ఆరుగురు మంత్రులు కూడా డుమ్మా కొట్టారన్న రోజా
  • ఇది ప్రజల ప్రభుత్వం కాదు, వ్యక్తిగత ప్రయోజనాల ప్రభుత్వమని విమర్శలు
  • కూటమి ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తోందో స్పష్టమైందంటూ ట్వీట్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల కోసం కాకుండా, ముఖ్యమంత్రి చంద్రబాబు  ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ల వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పనిచేస్తోందని వైసీపీ నేత రోజా తీవ్రంగా విమర్శించారు. సచివాలయంలో శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశం ప్రజలకు ఎలాంటి మేలు చేయకపోయినా, చంద్రబాబు, పవన్‌లకు మాత్రం గొప్ప లబ్ధి చేకూర్చిందని ఆమె ఆరోపించారు. రాష్ట్ర ప్రజల కంటే సొంత ప్రయోజనాలకే కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆమె సోషల్ మీడియా వేదికగా దుయ్యబట్టారు.

"ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్‌లో ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశాన్ని చూశాక, ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తోందో నాకు స్పష్టంగా అర్థమైంది. రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం కాకుండా, కేవలం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఈ సమావేశం జరిగిందా అనిపిస్తోంది.

కీలకమైన ప్రభుత్వ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారు రాలేదు. ఆయన తన కొత్త సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే, అదే సమయంలో ఆయన సినిమాకు బెనిఫిట్ షోలు వేసుకోవడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం నన్ను ఆశ్చర్యపరిచింది. మార్చి 19 నుంచి ఉదయం 4 గంటలకే షోలు వేసుకునేందుకు, టికెట్ ధరను రూ.500 వరకు అమ్ముకునేందుకు అనుమతులు ఇచ్చారు. అంతేకాదు, 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.125 పెంచుకోవచ్చని కూడా ఉత్తర్వులిచ్చారు.

మరోవైపు, పవన్ గైర్హాజరును ఎవరూ ప్రశ్నించకుండా ఉండేందుకే మరో ఆరుగురు మంత్రులు కూడా సమావేశానికి రాలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే సమావేశంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు ప్రత్యేక ప్రోత్సాహకాలు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఈ రోజు జరిగిన కేబినెట్ భేటీ వల్ల రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదు. కానీ, పవన్ కల్యాణ్‌కు, చంద్రబాబుకు మాత్రం కచ్చితంగా ప్రయోజనం చేకూరింది. ఈ పాలన ఎవరి కోసం, ఎవరి సంపదను పెంచడం కోసం సాగుతోందో ఈ ఒక్క ఉదాహరణతో తేటతెల్లమైంది. దీనిపై ప్రజలే ఆలోచించుకోవాలి" అని రోజా తన ట్వీట్ లో పేర్కొన్నారు.
Go Back to Shorts
Roja
Pawan Kalyan
Chandrababu Naidu
AP Cabinet Meeting
Heritage Foods
Usthad Bhagat Singh
Benefit Shows
Andhra Pradesh Politics
YSRCP
Movie Ticket Prices

More Telugu News