Perni Nani: ఏపీ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించిన పేర్ని నాని
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఈరోజు సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, శాంతిభద్రతలపై ఆయన పలు ప్రశ్నలు సంధించారు. హెరిటేజ్ సంస్థకు రాయితీలు ఇస్తున్నారంటూ మండిపడ్డారు.
రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ను 'అప్పుల మంత్రి'గా అభివర్ణించిన పేర్ని నాని, ప్రభుత్వం అప్పుల విషయంలో పచ్చి అబద్ధాలు చెబుతోందని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పక్కా ఆధారాలతో నిజాలు మాట్లాడారని, వాటిని అబద్ధమని నిరూపించే దమ్ము ప్రభుత్వానికి ఉందా అని సవాల్ చేశారు. ఇప్పటికే ప్రభుత్వం రూ. 3.27 లక్షల కోట్ల అప్పు చేసినట్లు జీవోలు ఉన్నాయని, కానీ అప్పులు కేవలం లక్ష కోట్లేనని తప్పుడు లెక్కలు చెబుతున్నారని మండిపడ్డారు. ఈ లెక్కలపై వారం రోజుల్లోగా స్పష్టత ఇవ్వాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని డిమాండ్ చేశారు. తప్పుడు లెక్కలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
రాష్ట్రంలో మహిళలపై అకృత్యాలు పెరుగుతున్నాయని, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మహిళను వేధిస్తే చర్యలు తీసుకోకపోగా, తిరిగి ఆమెపైనే కేసులు పెట్టడం దుర్మార్గమని విమర్శించారు. మహిళలను వేధిస్తే అదే వారికి చివరి రోజు అన్న చంద్రబాబు మాటలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. అలాగే హాస్టళ్లలో పిల్లలకు సరైన భోజనం అందడం లేదని, మైలవరం స్కూల్ ఘటనలే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. మంత్రి లోకేశ్ ప్రత్యేక విమానాల్లో విదేశాలకు వెళ్లి క్రికెట్ చూస్తున్నారని, ఆయనకు విద్యార్థుల కష్టాలు పట్టడం లేదని అన్నారు.
హెరిటేజ్ సంస్థ అప్‌గ్రేడ్ కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలంట అంటూ ధ్వజమెత్తారు. కరెంటు బిల్లుల్లో కూడా రాయితీలు కల్పిస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నియామకంపై కూడా ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్రమ సంబంధాల ఆరోపణలు ఉన్న వ్యక్తికి పవిత్రమైన టీటీడీ పదవి ఎలా ఇస్తారని నిలదీశారు.