KTR: రేవంత్ రెడ్డి బినామీ కంపెనీపై కేసులను ప్రభుత్వం తారుమారు చేసింది: అమిత్ షాకు కేటీఆర్ లేఖ

KTR Alleges Revanth Reddy Government Manipulated Cases in Amit Shah Letter
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ కేఎల్ఎస్ఆర్ ఇన్‌ఫ్రాటెక్‌పై కేసులను ప్రభుత్వం తారుమారు చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి బినామీ వ్యాపారాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కేటీఆర్ లేఖ రాశారు. ఈ లేఖ ప్రతులను కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, అర్జున్ రామ్ మేఘవాల్‌లకు కూడా పంపించారు.

తెలంగాణలో శాంతిభద్రతలు దిగజారాయని ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. కేఎల్ఎస్ఆర్ సంస్థపై కేసులు నమోదు కాగా, విచారణ వేళ ముఖ్యమంత్రి ఆదేశాలతో ప్రభుత్వం సాక్ష్యాధారాలను తారుమారు చేసిందని ఆరోపించారు. సాక్ష్యాలు పోయాయని చెప్పడం దారుణమని అన్నారు. అధికారులపై ముఖ్యమంత్రి ఒత్తిడి తెచ్చి సాక్ష్యాలను మాయం చేయించారని మండిపడ్డారు.

రాష్ట్రంలో విచారణ సంస్థలు, పోలీసులను నమ్మే పరిస్థితి లేదని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోయే పరిస్థితి వచ్చిందని అన్నారు. కేఎల్ఎస్ఆర్ కంపెనీ దివాలా తీసినా రేవంత్ రెడ్డి కాంట్రాక్టులు కేటాయించడం సరికాదని అన్నారు. ఈ సంస్థపై విచారణ జరగాలని, అది నిష్పక్షపాతంగా జరగాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కేంద్ర ఏజెన్సీలు విచారణ చేయాలని సుప్రీంకోర్టు సూచించినా రాష్ట్రం పట్టించుకోలేదని అన్నారు.
KTR
Revanth Reddy
KLSR Infratech
Amit Shah
Telangana Politics
BRS Party
Corruption Allegations

More Telugu News