పాక్ ఎయిర్ ఫోర్స్ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు దుర్మరణం!

Pakistan Air Force trainer aircraft crash kills two pilots in Mardan district
  • కుప్పకూలిన ఎయిర్‌ఫోర్స్ శిక్షణ విమానం
  • ప్రమాదంలో ఇద్దరు పైలట్లు అక్కడికక్కడే మృతి
  • జనావాసాలను తప్పించి పెను ప్రమాదం నివారించిన పైలట్లు
  • విమాన శకలాలు పడి ముగ్గురు పౌరులకు గాయాలు
  • ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిన పాక్ సైన్యం
పాకిస్థాన్ మిలిటరీ వైమానిక దళంలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని మర్దాన్ జిల్లా పరిధిలో సోమవారం ఉదయం పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ (PAF)కు చెందిన ఒక చిన్న శిక్షణ విమానం (Trainer Aircraft) కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానాన్ని నడుపుతున్న ఇద్దరు యువ పైలట్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. జనావాసాలు అధికంగా ఉండే సావల్ధేర్ కాట్లాంగ్ రోడ్డు సమీపంలో ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ విషాదం జరిగింది.

పాకిస్థాన్ మిలిటరీ మీడియా విభాగం 'ఐఎస్‌పీఆర్' (ISPR) వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రమాదానికి గురైన విమానాన్ని 'పీఏసీ ఎంఎఫ్‌ఐ-395 సూపర్ ముషాల్' (PAC MFI-395 Super Mushshak)గా గుర్తించారు. సాధారణ శిక్షణ రౌండ్‌లో భాగంగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ప్రమాదంలో మరణించిన వారిని ఎయిర్ ఫోర్స్ ఇన్‌స్ట్రక్టర్ ఫ్లైట్ లెఫ్టినెంట్ మహ్మద్ ఖాసిం అబ్దుల్లా, పాక్ నేవీకి చెందిన లెఫ్టినెంట్ తాహా అబ్బాసిగా ఆర్మీ ధ్రువీకరించింది. వీరు ఇద్దరూ విధి నిర్వహణలోనే వీరమరణం (Shahadat) పొందారని ఐఎస్‌పీఆర్ పేర్కొంది.

పైలట్ల చాకచక్యం - తప్పిన భారీ ప్రమాదం
విమానం నియంత్రణ కోల్పోతున్న సమయంలో పైలట్లు ఇద్దరూ అత్యంత సాహసోపేతంగా వ్యవహరించారు. విమానం గనుక సమీపంలోని గ్రామం లేదా ఇళ్లపై పడి ఉంటే భారీగా ప్రాణనష్టం జరిగి ఉండేదని స్థానిక అధికారులు తెలిపారు. పైలట్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి విమానాన్ని నివాస ప్రాంతాలకు దూరంగా ఉన్న ఖాళీ రోడ్డు పక్కన ల్యాండ్ చేయడానికి ప్రయత్నించారు. అయితే వేగంగా వచ్చి భూమిని ఢీకొట్టడంతో విమానం ముక్కలైంది. విమాన శిథిలాలు ఎగిరిపడటంతో రోడ్డుపై వెళ్తున్న ముగ్గురు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే మర్దాన్ మెడికల్ కాంప్లెక్స్ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఈ ఘోర ప్రమాదంపై పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ ఆసిమ్ మునీర్, ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన సైనికుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. విమానం కూలిపోవడానికి గల అసలు కారణాలను అన్వేషించడానికి ఎయిర్ హెడ్‌క్వార్టర్స్ ఒక ఉన్నత స్థాయి విచారణ కమిటీని (Board of Inquiry) ఏర్పాటు చేసింది. కొద్ది రోజుల క్రితమే పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో సైనిక హెలికాప్టర్ కూలి పలువురు సైనికులు మరణించిన ఘటన మరువక ముందే.. ఇప్పుడు మళ్లీ ఫైటర్ ట్రైనర్ విమానం కూలిపోవడం పాక్ రక్షణ రంగంలో ఆందోళన కలిగిస్తోంది.
Go Back to Shorts
Pakistan Air Force
Mardan plane crash
Super Mushshak trainer aircraft
Khyber Pakhtunkhwa aviation accident
Muhammad Qasim Abdullah
Pakistan military aircraft crash

More Telugu News