Shashi Kiran Reddy: హైదరాబాద్‌లో దారుణం: వెయ్యి రూపాయల కోసం కన్సల్టెన్సీ నిర్వాహకుడి హత్య

Hyderabad Recruitment Agency Owner Shashi Kiran Reddy Killed for 1000 Rupees
  • మధురానగర్‌లోని వారాహి రిక్రూట్‌మెంట్ కార్యాలయంలో ఘాతుకం
  • ఉద్యోగం నచ్చలేదని కట్టిన డబ్బులు తిరిగివ్వాలని గొడవ
  • బాకీ ఉన్న రూ.1000 కోసం యజమాని మెడపై కత్తితో దాడి
  • అడ్డువచ్చిన మహిళా ఉద్యోగినిపై కూడా నిందితుడి దాడి
కేవలం వెయ్యి రూపాయల కోసం ఒక ప్రాణం బలైపోయింది. తనకి రావాల్సిన డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఓ వ్యక్తి రిక్రూట్‌మెంట్ సంస్థ నిర్వాహకుడిని కార్యాలయంలోనే కిరాతకంగా చంపేశాడు. హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం మధ్యాహ్నం జరిగిందీ ఘటన.

ఏపీలోని ఏలూరుకు చెందిన జే శశికిరణ్ రెడ్డి (36) ఎల్లారెడ్డిగూడలో నివసిస్తూ మధురానగర్‌లో 'వారాహి మ్యాన్ పవర్ రిక్రూట్‌మెంట్' కన్సల్టెన్సీని నిర్వహిస్తున్నాడు. నల్గొండకు చెందిన ప్రభుకుమార్ అనే వ్యక్తి ఉద్యోగం కోసం ఆయనను సంప్రదించాడు. రూ.2,500 ఫీజు చెల్లించగా శశికిరణ్ అతడిని ఫిబ్రవరి 24న బంజారాహిల్స్‌లోని ఒక కంపెనీలో ఉద్యోగంలో చేర్పించాడు. అయితే, రెండు రోజులు పని చేసిన ప్రభుకుమార్ తనకు ఆ పని నచ్చలేదని, తాను కట్టిన డబ్బులు వెనక్కి ఇచ్చేయాలని పట్టుబట్టాడు.

సెటిల్‌మెంట్‌లో భాగంగా శశికిరణ్ రూ.1500 తిరిగి ఇచ్చేశాడు. మిగిలిన రూ.1000 విషయంలో ఇద్దరి మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. తనపై పాత కేసులు ఉన్నాయని, డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని ప్రభుకుమార్ గతంలోనే శశికిరణ్‌ను బెదిరించాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో కార్యాలయానికి వచ్చిన నిందితుడు, నేరుగా శశికిరణ్ క్యాబిన్‌లోకి వెళ్లి లోపల గడియ పెట్టాడు.

క్యాబిన్ లోపల రూ.1000 కోసం ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో ప్రభుకుమార్ వెంట తెచ్చుకున్న కత్తితో శశికిరణ్ మెడపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. శశికిరణ్ అరుపులు విని బయట ఉన్న సిబ్బంది తలుపులు కొట్టగా.. రక్తపు మడుగులో పడి ఉన్న యజమానిని వదిలి, కత్తి చూపిస్తూ నిందితుడు బయటకు వచ్చాడు. ఈ ఘోరాన్ని వీడియో తీస్తున్న లయ అనే ఉద్యోగినిపై కూడా దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు.

ఈ దాడిలో శశికిరణ్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన లయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుడి భార్య నాగభారతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు ప్రభుకుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Shashi Kiran Reddy
Hyderabad murder
Madhuranagar
recruitment agency
Varahi Manpower Recruitment
Prabhu Kumar
job consultancy
murder for 1000 rupees
crime news
Telangana police

More Telugu News