Dayashankar Pandey: మధ్యప్రదేశ్ లో దిగ్భ్రాంతికర ఘటన.. గర్భస్థ పిండంతో హైకోర్టులోకి ప్రవేశించిన వ్యక్తి

Dayashankar Pandey Enters High Court With Fetus in Madhya Pradesh
  • మధ్యప్రదేశ్ హైకోర్టులో ఓ వ్యక్తి పిండంతో కోర్టు గదిలోకి ప్రవేశం
  • న్యాయమూర్తి వేదికపై పిండం పెట్టి న్యాయం చేయాలని వేడుకోలు
  • తీవ్ర భద్రతా లోపంగా పరిగణించిన ఉన్నతాధికారులు
  • ఏఎస్ఐ సహా నలుగురు పోలీసు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు
మధ్యప్రదేశ్ హైకోర్టు జబల్‌పూర్ బెంచ్‌లో జరిగిన తీవ్ర భద్రతా వైఫల్యంపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. కోర్టు ప్రాంగణంలో భద్రతా లోపం ఆరోపణలపై ఒక అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ఏఎస్ఐ) సహా నలుగురు పోలీసు సిబ్బందిని మంగళవారం సస్పెండ్ చేశారు. ఒక పిటిషనర్ కోర్టు హాలులోకి పిండంతో ప్రవేశించిన ఘటన జరిగిన మరుసటి రోజే ఈ చర్యలు తీసుకోవడం గమనార్హం.

సోమవారం జరిగిన ఈ అనూహ్య ఘటన వివరాల్లోకి వెళితే.. రేవా జిల్లాకు చెందిన దయాశంకర్ పాండే అనే వ్యక్తి తన పిటిషన్‌పై విచారణ కోసం హైకోర్టుకు వచ్చాడు. గేట్ నంబర్-6 ద్వారా లోపలికి ప్రవేశించిన అతను, జస్టిస్ హిమాన్షు జోషి కోర్టు హాలులోకి వెళ్లాడు. విచారణ జరుగుతుండగా, తన బ్యాగులో నుంచి ఒక పిండం తీసి న్యాయమూర్తి వేదికపై పెట్టి, తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. దీంతో కోర్టు హాలులో ఉన్నవారంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. అది తన భార్యకు గర్భస్రావం కావడంతో మృతిచెందిన పిండమని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన జబల్‌పూర్ ఎస్పీ సంపత్ ఉపాధ్యాయ, భద్రతా వైఫల్యానికి బాధ్యులను చేస్తూ నలుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. సస్పెండైన వారిలో ఏఎస్ఐ మున్నా అహిర్వార్, హెడ్ కానిస్టేబుళ్లు బ్రహ్మదత్ ఖత్రీ, అరుణ్ ఉపాధ్యాయ, కానిస్టేబుల్ ప్రతీక్ సోంకర్ ఉన్నారు. ఘటన జరిగిన సమయంలో వీరంతా గేట్ నంబర్-6 వద్ద విధుల్లో ఉన్నారు.

తన సొంత ఊరిలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తనపై, తన కుటుంబంపై పలుమార్లు దాడులు చేశారని, స్థానిక పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ దయాశంకర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ రోజే ఈ ఘటన చోటుచేసుకుంది.
Dayashankar Pandey
Madhya Pradesh High Court
Jabalpur
security breach
fetus
police suspended
court incident
Rewa district
justice

More Telugu News