Narayana: వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో చెత్త సమస్య తీవ్ర రూపం దాల్చింది: నారాయణ

AP Minister Narayana Slams YCP Over Waste Management Crisis
  • వైసీపీ పాలనను చెత్త పాలనగా అభివర్ణించిన నారాయణ
  • ఇప్పటి వరకు కోటి 15 లక్షల టన్నుల చెత్తను క్లియర్ చేశామన్న మంత్రి
  • రాష్ట్రాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్య

గత వైసీపీ ప్రభుత్వంపై ఏపీ మంత్రి నారాయణ విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ ఐదేళ్ల పాలనను 'చెత్త పాలన'గా అభివర్ణిస్తూ, ఆ సమయంలో పేరుకుపోయిన వ్యర్థాల సమస్య రాష్ట్రానికి పెను సవాలుగా మారిందని ఆయన మండిపడ్డారు. వైసీపీ హయాంలో పట్టణాల్లో పారిశుద్ధ్యం పడకేయడం వల్లే నేడు భారీస్థాయిలో చెత్త నిల్వలు పేరుకుపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటి 53 లక్షల టన్నుల చెత్త నిల్వలు పేరుకుపోయాయని గుర్తించినట్లు మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు చేపట్టి, ఇప్పటివరకు కోటి 15 లక్షల టన్నుల చెత్తను క్లియర్ చేశామని వివరించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే పది 'వేస్ట్ టు ఎనర్జీ' (చెత్త నుంచి విద్యుత్) ప్లాంట్లు ప్రారంభించామని, వాటిలో రెండు పూర్తి చేశామని గుర్తుచేశారు. జగన్ ప్రభుత్వం ఆ ప్లాంట్లను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే నేడు రాష్ట్రంలో చెత్త సమస్య ఇంత తీవ్రరూపం దాల్చిందని ఆయన ధ్వజమెత్తారు.


భవిష్యత్తులో ఈ సమస్య తలెత్తకుండా ప్రధాన నగరాల్లో పీపీపీ పద్ధతిలో అత్యాధునిక వేస్ట్ ఎనర్జీ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని నారాయణ పేర్కొన్నారు. వ్యర్థాల నిర్వహణలో శాస్త్రీయ పద్ధతులను అనుసరిస్తూ రాష్ట్రాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించిన ఆయన, పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ, తాగునీటి ప్రాజెక్టులను త్వరలోనే పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.

Narayana
AP Minister Narayana
YCP Government
Waste Management Andhra Pradesh
Chandrababu Naidu
Waste to Energy Plants
Andhra Pradesh Politics
Nellore Development
Sanitation Andhra Pradesh
Solid Waste Management

More Telugu News