Sajjala Ramakrishna Reddy: జగన్ ను ఎదుర్కోలేక చంద్రబాబు కుట్రపూరిత ఆరోపణలు చేస్తున్నారు: సజ్జల

Sajjala Ramakrishna Reddy Slams Chandrababus Allegations on Tirumala Laddu
  • తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారన్న సజ్జల
  • తమ హయాంలో తిరుమలలో క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశామని వెల్లడి
  • బీఆర్ నాయుడు విషయంలో చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్న

వైసీపీ అధినేత జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేకే ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదంపై కుట్రపూరిత ఆరోపణలు చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, కెమికల్స్ కలిపారంటూ చంద్రబాబు చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలని సజ్జల కొట్టిపారేశారు. వైసీపీ హయాంలోనే తిరుమలలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. మార్కెట్‌లో హెరిటేజ్ నెయ్యి ధర కంటే ఇందాపూర్, అమూల్ నెయ్యి ధరలు తక్కువగా ఉన్నాయని... కేవలం కొన్ని సంస్థలకు లబ్ధి చేకూర్చడానికే నెయ్యి కాంట్రాక్టుల విషయంలో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.


నెయ్యి కాంట్రాక్టుల వెనుక భారీ ఆర్థిక కుంభకోణం దాగి ఉందని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని సజ్జల డిమాండ్ చేశారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసి స్వామివారి సొమ్మును దోచుకోవడమే ఈ విష ప్రచారం వెనుక ఉన్న అసలు ఉద్దేశమని విమర్శించారు.


టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడికి సంబంధించిన వీడియోల వివాదంపై సజ్జల స్పందిస్తూ... గతంలో తమ హయాంలో సినీ నటుడు పృథ్వీపై ఆరోపణలు రాగానే తక్షణమే రాజీనామా చేయించామని, కానీ ఇప్పుడు బీఆర్ నాయుడి విషయంలో చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. బీఆర్ నాయుడు తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. భక్తుల విశ్వాసాలపై చంద్రబాబుకు విశ్వాసం లేదనే విషయం మరోసారి అర్థమయిందని అన్నారు.

Sajjala Ramakrishna Reddy
Chandrababu Naidu
Jagan Mohan Reddy
Tirumala laddu
TTD
BR Naidu
Heritage ghee
Andhra Pradesh politics
YSRCP
TDP

More Telugu News