Roja: సీఎం, డిప్యూటీ సీఎం వంటి స్థానాల్లో ఉన్నవారు బాధ్యతాయుతంగా ఉండాలి: రోజా
- రాజకీయ లబ్ధి కోసం దేవుడిని వాడుకోవడం సరికాదన్న రోజా
- కూటమి నేతలు పుణ్యక్షేత్రాల ప్రతిష్టను దిగజార్చుతున్నారని మండిపాటు
- హామీలు నేరవేర్చలేకపోతే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలని హితవు
ఏపీలోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ... రాజకీయ లబ్ధి కోసం దేవుడిని, ఆలయాల ప్రతిష్ఠను వాడుకోవడం తగదని హితవు పలికారు. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో వస్తున్న ఆరోపణలు అసత్యమని, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
రాజకీయం చేయడానికి వేరే అంశాలు లేకనే దేవుడిని, ఆలయాలను వివాదాల్లోకి లాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల, శ్రీశైలం, అన్నవరం వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల ప్రతిష్ఠను కూటమి నేతలు దిగజార్చుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, హోం మంత్రి వంటి ఉన్నత స్థానాల్లో ఉన్న వారు బాధ్యతాయుతంగా మాట్లాడాలని హితవు పలికారు. శాసనమండలి చైర్మన్ స్థానంలో ఉన్న వ్యక్తి కులం, మతం గురించి మాట్లాడటం అత్యంత విచారకరమని వ్యాఖ్యానించారు.
తిరుమల లడ్డూ వ్యవహారంలో తమ వైపు తప్పు లేదని ప్రభుత్వం భావిస్తే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలని ఎద్దేవా చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు అసత్య ప్రచారాలు చేయడం సరికాదని పేర్కొన్నారు.