ఇరాన్ యుద్ధనౌకను అమెరికా ఎలా ముంచేసిందంటే... వీడియో ఇదిగో!

  • శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధనౌకను ముంచేసిన అమెరికా
  • జలాంతర్గామి టార్పెడో దాడిలో 87 మంది సిబ్బంది మృతి
  • 32 మందిని రక్షించిన శ్రీలంక నౌకాదళం
  • దాడి వీడియోను విడుదల చేసిన అమెరికా రక్షణ శాఖ
ఇరాన్‌పై ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శ్రీలంక తీరానికి సమీపంలో ఇరాన్‌కు చెందిన ఐఆర్‌ఐఎస్ దేనా (ఐఆర్ఐఎస్ దేనా) అనే యుద్ధనౌకను అమెరికా జలాంతర్గామి టార్పెడోతో దాడి చేసి ముంచివేసింది. ఈ ఘటనలో 87 మంది ఇరాన్ నావికా సిబ్బంది మరణించగా, మరో 32 మందిని రక్షించారు. ఈ దాడికి తామే బాధ్యులమని అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) ప్రకటించడమే కాకుండా, ఇందుకు సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. 

ఇరాన్ నౌక నుంచి అందిన అత్యవసర సమాచారంతో శ్రీలంక నౌకాదళం రంగంలోకి దిగింది. గాలింపు చర్యలు చేపట్టగా, ఘటనా స్థలంలో నౌక పూర్తిగా మునిగిపోయిందని, కేవలం ఆయిల్ మరకలు, లైఫ్ జాకెట్లు మాత్రమే కనిపించాయని శ్రీలంక నౌకాదళం వెల్లడించింది. నీటిలో తేలియాడుతున్న సిబ్బందిని గుర్తించి 32 మందిని రక్షించామని, 87 మృతదేహాలను వెలికితీశామని తెలిపింది. రక్షించిన వారిని ఆసుపత్రికి తరలించామని, వారిలో కొంతమందికి అత్యవసర చికిత్స అవసరమైందని వెల్లడించింది. కాగా, ప్రమాద సమయంలో నౌకలో మొత్తం 180 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. 


More Telugu News