ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టులో ఎదురుదెబ్బ

Ananthababu bail petition rejected
  • డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక నిందితుడు అనంతబాబు
  • బెయిల్ పిటిషన్ తిరస్కరించిన కోర్టు
  • సాక్షుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని స్పెషల్ పీపీ

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు న్యాయస్థానంలో మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ అనంతబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను రాజమండ్రిలోని కోర్టు తిరస్కరించింది. ఇరుపక్షాల సుదీర్ఘ వాదనల అనంతరం న్యాయమూర్తి ఈ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


ఈ కేసు విచారణ సందర్భంగా ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ముప్పాళ్ల సుబ్బారావు కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. సుబ్రమణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న అనంతబాబు... గతంలో బెయిల్ పై బయటకు వచ్చినప్పుడు సాక్షులను చంపుతానని బెదిరించారని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు మళ్లీ బెయిల్ ఇస్తే సాక్షుల ప్రాణాలకు ముప్పు ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ అత్యంత కీలక దశలో ఉన్నందున, ఇలాంటి సమయంలో అతనికి బెయిల్‌ ఇవ్వడం ఎంతమాత్రం సరికాదని విజ్ఞప్తి చేశారు. 


సాక్షుల భద్రత, కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుంటూ అనంతబాబు వేసిన బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పునిచ్చారు.

Advertisement
Ananthababu
YSRCP
Bail

More Telugu News