Ali Khamenei: ఇరాన్ రక్షణ కవచాన్ని ఛేదించిన మొసాద్.. ఖమేనీ కదలికలపై నిఘా ఇలా!

Mossad Breached Irans Defense Shield Monitoring Khamenei
  • ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీపై దాడి వెనుక మొసాద్ పక్కా వ్యూహం
  • టెహ్రాన్ ట్రాఫిక్ కెమెరాలను హ్యాక్ చేసి ఏళ్ల తరబడి నిఘా
  • భద్రతా సిబ్బంది ఫోన్లను ట్రాక్ చేసి ఖమేనీ కదలికల గుర్తింపు
  • ఫైనాన్షియల్ టైమ్స్ కథనంలో వెలుగులోకి సంచలన వివరాలు
  • ఇజ్రాయెల్ ఆపరేషన్‌కు అమెరికా సీఐఏ సాయం అందించినట్లు సమాచారం
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ అత్యంత పకడ్బందీ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇరాన్ పటిష్ఠమైన భద్రతా వలయాన్ని ఛేదించేందుకు మొసాద్ ఏళ్ల తరబడి గ్రౌండ్ వర్క్ చేసిందని, ఇందుకు అత్యాధునిక సైబర్ టెక్నాలజీని ఉపయోగించిందని 'ఫైనాన్షియల్ టైమ్స్' తన కథనంలో సంచలన విషయాలు వెల్లడించింది.

ఆ కథనం ప్రకారం టెహ్రాన్ నగరంలోని వేలాది ట్రాఫిక్ కెమెరాలను మొసాద్ కొన్నేళ్ల క్రితమే హ్యాక్ చేసింది. ముఖ్యంగా ఖమేనీ నివాసం ఉండే పాశ్చర్ స్ట్రీట్ పరిసరాల్లోని కెమెరాల ద్వారా ఆయన భద్రతా సిబ్బంది కదలికలను ఏళ్ల తరబడి విశ్లేషించింది. వారి కార్ల పార్కింగ్, ప్రయాణ మార్గాలను గమనించి వారి దినచర్యను మ్యాప్ చేసింది. ఈ ఫుటేజ్‌ను ఎన్‌క్రిప్ట్ చేసి టెల్ అవీవ్‌లోని సర్వర్లకు చేరవేసింది.

కేవలం కెమెరాలే కాకుండా, టెహ్రాన్‌లోని మొబైల్ నెట్‌వర్క్‌లలోకి కూడా మొసాద్ చొరబడింది. ఖమేనీ అంగరక్షకుల ఫోన్లను ట్రాక్ చేయడం ద్వారా ఆయన సమావేశమయ్యే ప్రదేశాలను కచ్చితంగా గుర్తించింది. దాడికి ముందు రోజు ఆ ప్రాంతంలోని డజనుకు పైగా మొబైల్ టవర్లను సాంకేతికంగా నిలిపివేసింది. దీంతో భద్రతా సిబ్బంది ఫోన్లకు ఎలాంటి హెచ్చరికలు అందకుండా, కాల్స్ 'బిజీ' అని వచ్చేలా చేసింది.

ఈ ఆపరేషన్‌లో ఇజ్రాయెల్‌కు చెందిన సిగ్నల్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ 8200 కీలక పాత్ర పోషించగా, అమెరికా సీఐఏ ఒక మానవ వనరు ద్వారా ఖమేనీ ఉనికిని నిర్ధారించిందని సమాచారం. "మాకు టెహ్రాన్ గురించి జెరూసలేం అంత బాగా తెలుసు" అని ఒక ఇజ్రాయెల్ అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ పక్కా సమాచారంతోనే 30కి పైగా క్షిపణులతో ఖమేనీ కాంపౌండ్‌పై ఇజ్రాయెల్ దాడి చేసినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది.
Ali Khamenei
Iran
Mossad
Israel
cyber technology
Financial Times
Tehran
mobile networks
Unit 8200
CIA

More Telugu News