Chandrababu Naidu: అమరావతిలో నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ ఏర్పాటు చేయండి: సీజేఐని కోరిన సీఎం చంద్రబాబు

Chandrababu Naidu requests CJI to establish National Judicial Academy in Amaravati
  • ఏపీ రాజధానిలో అంతర్జాతీయ ప్రమాణాలతో జస్టిస్ సిటీ నిర్మాణం
  • మధ్యవర్తిత్వంతో కేసు పరిష్కారమైతే రూ.10 వేలు.. లేకుంటే రూ.3 వేల సాయం
  • న్యాయ వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం
  • వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రతిష్టాత్మక నేషనల్ జ్యుడిషియల్ అకాడమీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్‌ను కోరారు. అమరావతిలో నిర్మిస్తున్న 'జస్టిస్ సిటీ'ని దేశంలోనే అత్యుత్తమ మోడల్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని, దీనికి న్యాయ వ్యవస్థ సహకారం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఆదివారం విజయవాడలో ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ‘మధ్యవర్తిత్వం’పై జరిగిన రాష్ట్రస్థాయి సదస్సులో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌కు సీఎం చంద్రబాబు, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ సాదర స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ.. రాజధాని నిర్మాణంలో భాగంగా జస్టిస్ సిటీలో న్యాయ వ్యవస్థకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు వివరించారు. కేవలం కోర్టు భవనాలే కాకుండా.. జ్యుడిషియల్ అకాడమీ, లీగల్ సర్వీసెస్ అథారిటీ, మీడియేషన్ సెంటర్, ఇంటర్నేషనల్ లా యూనివర్సిటీ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వంటి కీలక విభాగాలన్నింటినీ ఒకే చోట అనుసంధానిస్తూ (ఇంటిగ్రేట్) బెస్ట్ జ్యుడిషియల్ సిటీని నిర్మిస్తామని స్పష్టం చేశారు. ఈ సంస్థల ఏర్పాటుకు అవసరమైన భూములను కేటాయించేందుకు, ఇతరత్రా పూర్తి సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీజేఐకి భరోసా ఇచ్చారు.

మధ్యవర్తిత్వానికి ఆర్థిక ప్రోత్సాహం
సమాజంలో మధ్యవర్తిత్వం ద్వారా సత్వర న్యాయం అందాల్సిన ఆవశ్యకతను సీఎం నొక్కిచెప్పారు. గతంలో గ్రామాల్లో పెద్దమనుషుల సమక్షంలో చాలా సమస్యలు పరిష్కారమయ్యేవని, తన తండ్రి కూడా గ్రామంలో ఇలాంటి పెద్దరికం వహించి ఎన్నో వివాదాలను పరిష్కరించారని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. ఈ విధానాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోందని తెలిపారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసు పరిష్కారమైతే రూ.10 వేలు, ఒకవేళ పరిష్కారం కాకపోయినా ఆ ప్రక్రియలో పాల్గొన్నందుకు రూ.3 వేలు అందిస్తామని ప్రకటించారు. న్యాయం త్వరగా జరిగితేనే అభివృద్ధి వేగవంతం అవుతుందని, అందుకే ఇలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వడం ప్రభుత్వానికి భారం కాదని అభిప్రాయపడ్డారు.

బ్లూ-గ్రీన్ సిటీగా అమరావతి
దేశంలోనే ఎక్కడా లేని విధంగా అమరావతిని బ్లూ-గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా అభివృద్ధి చేస్తున్నట్లు సీఎం తెలిపారు. 29,000 మందికి పైగా రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇవ్వడం చారిత్రక ఘట్టమని కొనియాడారు. ప్రజల అవసరాలు, పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక బలం కలగలిసిన నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతున్నామన్నారు. వికసిత్ భారత్-2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, సీనియర్ న్యాయవాదులు, న్యాయశాఖ అధికారులు పాల్గొన్నారు.
Chandrababu Naidu
Amaravati
National Judicial Academy
Justice Surya Kant
AP High Court
Justice City
Mediation
Andhra Pradesh
Legal Services Authority
Blue Green City

More Telugu News