Advertisement

ఎన్‌టీఏలో ప్రక్షాళన.. 47 మంది అధికారులపై వేటు

Center ready to overhaul NTA and removes 47 officials
  • విశ్వసనీయతను పునరుద్ధరించే చర్యల్లో భాగంగా 47 మంది అధికారుల తొలగింపు
  • పరీక్షల నిర్వహణకు సంబంధించిన అవుట్‌సోర్సింగ్ విధానంలోనూ సంస్కరణలు
  • నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు భారీ మార్పులకు సన్నాహాలు
నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీకేజీ వివాదంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రక్షాళన దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. సంస్థ విశ్వసనీయతను పునరుద్ధరించే లక్ష్యంతో ఎన్‌టీఏలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే సుమారు 47 మంది అధికారులను విధుల నుంచి తొలగించింది.

రాబోయే నెల రోజుల్లో ఈ పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తికానున్నట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో భవిష్యత్తులో ఎలాంటి లీకేజీలకు, అవకతవకలకు తావులేకుండా అత్యంత పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే తొలగించిన 47 మంది అధికారులతో పాటు, మరికొందరిపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పరీక్షల నిర్వహణకు సంబంధించిన అవుట్‌సోర్సింగ్ విధానాన్ని కూడా పూర్తిగా మార్చాలని, అంతర్గత నియంత్రణ వ్యవస్థలను బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని భావిస్తోంది.

ఈ ఏడాది జరిగిన నీట్-యూజీ పరీక్షలో పేపర్ లీక్ కావడం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. విద్యార్థుల ఆందోళనలు, పార్లమెంటులో విపక్షాల నిరసనలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో సుమారు 22 లక్షల మంది విద్యార్థులకు తిరిగి పరీక్ష నిర్వహించాల్సి వచ్చింది. పరీక్షల నిర్వహణ వ్యవస్థను సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం ప్రస్తుతం ఈ చర్యలు చేపడుతోంది.

తాజా మార్పులు కేవలం స్వల్ప సర్దుబాట్లు కాదని, వ్యవస్థను సమూలంగా మార్చే 'ఫండమెంటల్ రీసెట్' అని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నీట్, జేఈఈ మెయిన్, సీయూఈటీ వంటి 15 నుంచి 20 కీలక జాతీయ స్థాయి పరీక్షలను ఎన్‌టీఏ నిర్వహిస్తోంది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశించే ఈ ప్రవేశ పరీక్షల పవిత్రతను కాపాడటమే ఈ సంస్కరణల ప్రధాన ఉద్దేశం.
Advertisement
National Testing Agency
NEET UG 2026 paper leak
Central Government education reforms
NTA officials removed

More Telugu News